Indigo Airlines: ఇండిగో విమానంలో పేలిన పవర్‌ బ్యాంక్‌.. టేకాఫ్‌కు ముందు కలకలం

Indigo Airlines Power Bank Explodes on Delhi to Dimapur Flight
  • ఢిల్లీ-దిమాపూర్ ఇండిగో విమానంలో ఘటన
  • టేకాఫ్ కోసం వెళ్తుండగా పవర్‌ బ్యాంక్‌కు నిప్పు
  • వెంటనే స్పందించి మంటలను ఆర్పేసిన సిబ్బంది
  • ప్రయాణికులంతా సురక్షితమని తెలిపిన ఇండిగో
ఢిల్లీ నుంచి నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు బయల్దేరిన ఇండిగో విమానంలో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ కోసం రన్‌వేపైకి వెళ్తుండగా (ట్యాక్సీయింగ్) ఓ ప్రయాణికుడికి చెందిన పవర్‌ బ్యాంక్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే, విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇండిగోకు చెందిన 6ఈ 2107 విమానం ఢిల్లీ నుంచి దిమాపూర్‌కు బయల్దేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు తన పవర్‌ బ్యాంక్‌ను సీటు వెనుక ఉన్న పాకెట్‌లో పెట్టారు. విమానం కదులుతున్న సమయంలో ఆ పవర్‌ బ్యాంక్‌లో మంటలు వ్యాపించాయి. దీన్ని గమనించిన క్యాబిన్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు.

ఈ ఘటనపై ఇండిగో విమానయాన సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుడి ఎలక్ట్రానిక్ పరికరంలో మంటలు చెలరేగిన కారణంగా విమానాన్ని తిరిగి బే వద్దకు తీసుకువచ్చినట్లు తెలిపింది. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి కొన్ని క్షణాల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారని పేర్కొంది. ఈ ఘటనలో ప్రయాణికులకు గానీ, సిబ్బందికి గానీ ఎలాంటి హాని జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. అయితే, ఆ సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే వివరాలను సంస్థ వెల్లడించలేదు.
Indigo Airlines
Indigo flight
power bank explosion
Delhi Dimapur flight
flight fire
aviation safety
Dimapur
Nagaland
flight incident

More Telugu News