Maleapati Subbaraidu: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతి .. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

TDP Leader Maleapati Subbaraidu Passes Away CM Chandra Babu Condolences
  • బ్రెయిన్ స్టోక్ తో అస్వస్థత.. పది రోజులు చికిత్స పొందిన సుబ్బానాయుడు 
  • నిన్న రాత్రి తుది శ్వాస విడిచిన వైనం
  • సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటన్న సీఎం  
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ ఆగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కన్నుమూశారు. మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ గత పది రోజులుగా విజయవాడలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.

ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుబ్బానాయుడు త్వరగా కోలుకొని ఆసుపత్రి నుండి తిరిగి వస్తారని ఆశించానని, కానీ ఆయన అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. కావలి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి సుబ్బానాయుడు ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు.

నిబద్ధత, అంకితభావం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమని ఆయన అన్నారు. సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులకు, బంధువులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ ఎల్లప్పుడూ సుబ్బానాయుడు కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 

మంత్రి లోకేశ్ సంతాపం

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న నారా లోకేశ్ మాలేపాటి మృతి వార్త తెలిసి ఎక్స్ వేదికగా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన సుబ్బానాయుడు కావలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా పనిచేశారన్నారు. పార్టీ పటిష్టత కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారని కొనియాడారు.  వారి మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. సుబ్బానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Maleapati Subbaraidu
TDP
Andhra Pradesh
Chandra Babu Naidu
AP Agros Corporation
Kavali
Brain Stroke
Political News
Telugu Desam Party

More Telugu News