Naxalites: అగ్రనేతలు వేణుగోపాల్, ఆశన్నల లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం

Maoist Party Condemns Venugopal Ashanna Surrender as Betrayal
  • వారిని విప్లవ ద్రోహులుగా ప్రకటిస్తూ పార్టీ నుంచి బహిష్కరణ
  • ఫడ్న‌వీస్‌తో వేణుగోపాల్‌కు సంబంధాలున్నాయని సంచలన ఆరోపణ
  • ప్రాణభయంతోనే శత్రువు ముందు మోకరిల్లారని అధికార ప్రతినిధి అభయ్ వెల్లడి
  • నేతలను గుర్తించడంలో విఫలమయ్యామని అంగీకరించిన పార్టీ
  • ఉద్యమం ఆగదని, పునర్నిర్మాణం చేస్తామని ప్రజలకు హామీ
మావోయిస్టు పార్టీలో అగ్రనేతల లొంగుబాటు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల ఆయుధాలతో సహా లొంగిపోయిన అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలపై మావోయిస్టు పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వారి లొంగుబాటును 'విప్లవ ద్రోహం'గా అభివర్ణించిన పార్టీ, వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖను విడుదల చేసింది. వేణుగోపాల్, ఆశన్నలకు ప్రజలే తగిన శిక్ష విధిస్తారని ఆ లేఖలో హెచ్చరించారు.

ఫడ్న‌వీస్‌తో సంబంధాలున్నాయని ఆరోపణ
వేణుగోపాల్ ఒక కోవర్టుగా వ్యవహరించారని అభయ్ తన లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. గతంలో వేణుగోపాల్ భార్య మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయిందని, అప్పటి నుంచే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌తో ఆయనకు సంబంధాలు ఏర్పడి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. 2011 నుంచే వేణుగోపాల్‌లో పెత్తందారీతనం, అహంభావం పెరిగాయని, పార్టీ పలుమార్లు హెచ్చరించినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని వివరించారు. 2020లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య ఉద్యమంలోని లోపాలపై ఆయన ప్రవేశపెట్టిన పత్రాన్ని కమిటీ తిరస్కరించిందని గుర్తుచేశారు.

ప్రాణభయంతోనే లొంగుబాటు
ఈ ఏడాది మే నెలలో జరిగిన కగార్ దాడిలో పార్టీ కార్యదర్శి బసవరాజ్ మరణించిన తర్వాత వేణుగోపాల్‌లో ప్రాణభయం పెరిగిపోయిందని అభయ్ పేర్కొన్నారు. ఆ భయంతోనే శత్రువు ముందు మోకరిల్లారని తెలిపారు. పార్టీకి అప్పగించాల్సిన ఆయుధాలను శత్రువులకు అప్పగించి క్షమించరాని ద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఎందరో కామ్రేడ్స్ ప్రాణత్యాగం చేసి సంపాదించిన ఆయుధాలను తిరిగి శత్రువుకు అప్పగించడం విప్లవకారులను హత్య చేయడంతో సమానమని అభిప్రాయపడ్డారు.

ఉద్యమంలో ఎదురైన తాత్కాలిక వెనుకంజ, నేతల్లో పెరిగిన మితవాద భావాలను సకాలంలో గుర్తించడంలో పార్టీ విఫలమైందని అభయ్ అంగీకరించారు. ఈ వైఫల్యంపై సమీక్షించుకుని, గుణపాఠాలు నేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఎంతమంది లొంగిపోయినా పార్టీ మాత్రం ఎప్పటికీ శత్రువుకు లొంగిపోదని, ఉద్యమాన్ని పునర్నిర్మిస్తామని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
Naxalites
Mallojula Venugopal
Venugopal
Maoist party
Ashanna
Surrender
Maharashtra government
Devendra Fadnavis
Basavaraj
Kagar attack

More Telugu News