Revanth Reddy: 'జూబ్లీహిల్స్'లో ఓట్లు చీల్చేందుకే బీఆర్ఎస్ ఈ ఎత్తుగడ వేసింది: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams BRS for Jubilee Hills Election Tactics
  • మరింత వేడెక్కిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వాతావరణం
  • బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయంటూ రేవంత్ రెడ్డి విమర్శలు
  • లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహం అమలు చేశారన్న సీఎం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాటల యుద్ధం మరింత ముదిరింది. విపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికలో బీజేపీతో ఆ పార్టీ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకే బీఆర్ఎస్ ఈ ఎత్తుగడ వేస్తోందని ఆయన విమర్శించారు.

ఆదివారం చారిత్రక చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీతో బీఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకుందని ఆయన ఆరోపించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు 21 శాతం బీజేపీకి బదిలీ కావడమే వారి కుట్ర రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. "ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ అదే రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తోంది" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు రాజకీయాలు కొనసాగుతాయని ఆయన జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లను చీల్చేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించి దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేశారని గుర్తుచేశారు. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ చార్మినార్ నుంచి ప్రారంభించిన సద్భావన యాత్ర స్ఫూర్తిని కొనసాగించడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారాన్ని సీఎం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తదితర నేతలు పాల్గొన్నారు.
Revanth Reddy
Jubilee Hills
BRS
BJP
Telangana Politics
Vishnuvardhan Reddy
Congress Party
Rajiv Gandhi
Charminar
Salman Khurshid

More Telugu News