Nara Lokesh: ఆ ఒక్క ఫోన్ కాల్‌తోనే ఏపీకి గూగుల్: అసలు విషయం చెప్పిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Google to AP with Central Govt Support
  • ఆస్ట్రేలియాలో నారా లోకేశ్ పర్యటన 
  • సిడ్నీలో తెలుగు డయాస్పొరాతో సమావేశం
  • ఏపీకి గూగుల్ సిటీ రావడం వెనుక కేంద్రం సహకారం ఉందని వెల్లడి
  • ప్రధాని జోక్యంతో గూగుల్ కోసం చట్ట సవరణ
  • పవన్‌తో కలిసి 15 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించడమే లక్ష్యం అంటూ వ్యాఖ్యలుస
  • గూగుల్ ఎంత ముఖ్యమో.. ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యమని స్పష్టీకరణ
రాష్ట్రానికి ‘గూగుల్ ఏఐ డేటా సెంటర్’ రావడం వెనుక కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని, సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యంతోనే ఇది సాధ్యమైందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. తాను గూగుల్ సంస్థను ఆంధ్రప్రదేశ్‌కు రావాలని కోరినప్పుడు, కేంద్ర చట్టాల్లో కొన్ని సవరణలు అవసరమని వారు చెప్పారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ద్వారా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడి ఆ చట్టాలను సవరించేలా చేశారని లోకేశ్ వివరించారు. ఈ కేంద్ర ప్రభుత్వ చొరవతోనే గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఏపీకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌ ప్రాంగణంలోని బ్రూవర్స్ పెవిలియన్ నోబుల్ డైనింగ్ రూమ్‌లో ఏపీఎన్ఆర్‌టీ ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక విషయాలను పంచుకున్నారు.

కేంద్ర సహకారంతోనే రాష్ట్ర ప్రగతి
కేవలం గూగుల్ మాత్రమే కాకుండా, కొప్పర్తి నోడ్, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి ఫార్మాసిటీ వంటి అనేక కీలక ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతోనే రాష్ట్రంలో రూపుదిద్దుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఆర్సెల్లర్ మిట్టల్ ప్రాజెక్ట్ విషయంలోనూ కేంద్రం ఇలాగే సహకరించిందని, ఒక్క జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను అనకాపల్లికి తీసుకురాగలిగామని అన్నారు. తనకు గూగుల్ వంటి పెద్ద సంస్థలు ఎంత ముఖ్యమో, మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కూడా అంతే ముఖ్యమని లోకేశ్ స్పష్టం చేశారు.

పవన్‌తో కలిసి 15 ఏళ్ల ప్రయాణం
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తమ పొత్తు ఎంతో స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోందని లోకేశ్ పేర్కొన్నారు. పొత్తుల్లో చిన్న చిన్న సమస్యలు సహజమే అయినా, రాబోయే 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్నదే తమ ఉమ్మడి లక్ష్యమని పవన్ పదేపదే చెబుతున్నారని గుర్తుచేశారు. గత ఐదేళ్ల పాలనలో పీపీఏలు, ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల రాష్ట్రం, దేశం తీవ్రంగా నష్టపోయాయని, ఆ చేదు అనుభవం పునరావృతం కాకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలపడమే తమ ఏకైక అజెండా అని, తెలుగువారు మళ్లీ గర్వంగా తలెత్తుకునే రోజులు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రవాసాంధ్రులే మన బ్రాండ్ అంబాసిడర్లు
విదేశాల్లో స్థిరపడిన తెలుగువారంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని లోకేశ్ పిలుపునిచ్చారు. "మీరు మీ కంపెనీలలో రాష్ట్రం గురించి మాట్లాడితే, నా కన్నా మార్కెటింగ్ సులభంగా జరుగుతుంది. ఏదైనా కంపెనీ భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మా దృష్టికి తీసుకురండి, ఆ డీల్ పూర్తి చేసే బాధ్యత మేం తీసుకుంటాం" అని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని, ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంలో పాలుపంచుకోవాలని కోరారు. ప్రవాసాంధ్రుల పెట్టుబడులకు మద్దతుగా ఏపీఎన్ఆర్‌టీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, దానిని ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డుకు అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఉన్న తెలుగువారికి, ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు ఏపీఎన్ఆర్‌టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని లోకేశ్ తెలిపారు. అనంతరం ప్రవాసాంధ్రులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో సిడ్నీలోని భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ ఎస్. జానకీ రామన్, ఏపీఎన్ఆర్‌టీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ వేమూరి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
Google AI Data Center
APNRT
Chandrababu Naidu
Narendra Modi
Pawan Kalyan
MSME
Economic Development

More Telugu News