Nara Lokesh: ఆస్ట్రేలియా ప్రధానికి కూడా ఇలాంటి స్వాగతం లభించదన్నారు: సిడ్నీలో నారా లోకేశ్

Nara Lokesh addresses Telugu community in Sydney Australia
  • ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
  • సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో తెలుగు డయాస్పొరాతో సమావేశం
  • ఆస్ట్రేలియాలో తెలుగు వారి జోష్ మాస్ జాతరను తలపిస్తోందంటూ హర్షం
  • రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎన్నారైలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపు
  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం అని ఉద్ఘాటన
ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. ఆయన ఇక్కడి తెలుగు సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. "అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిదే డామినేషన్. నేను ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ మీ జోష్, మీ ఉత్సాహం ఒక మాస్ జాతరను తలపిస్తోంది" అని అన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కేటాయించిన ఒక అధికారి సైతం 'మా ప్రధానమంత్రికి కూడా ఇంతటి ఘన స్వాగతం లభించదు' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారని లోకేశ్ తెలిపారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలో ఏపీఎన్ఆర్‌టీ ఆధ్వర్యంలో జరిగిన 'ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా' సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో తెలుగు వారు లేని దేశమంటూ లేదని, ప్రతిచోటా తమదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు. తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని, తెలుగువారి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, చంద్రబాబు తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. 1995లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఐటీ రంగం తెలుగువారికి దగ్గరైందని, 'కంప్యూటర్ అన్నం పెడుతుందా?' అని ఎగతాళి చేసిన వారే ఇప్పుడు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ప్రవాస తెలుగువారంతా కుటుంబ సభ్యుల్లా అండగా నిలిచారని లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలోని ప్రతి నగరంలో నిరసనలు తెలిపి తమకు ధైర్యాన్నిచ్చారని అన్నారు. "అందరూ మిమ్మల్ని నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్నారైలు) అంటారు. కానీ నేను మిమ్మల్ని మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ (ఎంఆర్ఐలు) అంటాను. సముద్రాలు దాటినా మాతృభూమిపై మీకున్న ప్రేమ వెలకట్టలేనిది" అని ప్రశంసించారు. 2024 ఎన్నికలను ప్రతి ఎన్నారై తమ సొంత ఎన్నికగా భావించి, కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారని, దాని ఫలితమే ఈ చారిత్రక విజయమని స్పష్టం చేశారు.

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని లోకేశ్ వివరించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, కొత్తగా ఎన్నికైన 50 మంది ఎమ్మెల్యేలు, 17 మంది కొత్త మంత్రులతో కూడిన యువ బృందం కసితో పనిచేస్తోందని తెలిపారు. "ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ" అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికను వివరించారు. అనంతపురాన్ని ఆటోమోటివ్ హబ్‌గా, కర్నూలును పునరుత్పాదక ఇంధన కేంద్రంగా, చిత్తూరు, కడపలను ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా, ప్రకాశం జిల్లాను సీబీజీ హబ్‌గా, ఉభయ గోదావరి జిల్లాలను డిఫెన్స్ హబ్‌గా, ఉత్తరాంధ్రను డేటా సిటీగా అభివృద్ధి చేస్తామని... నెల్లూరుకు రిఫైనరీ వచ్చిందని వెల్లడించారు.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ పునరుద్ఘాటించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని 'డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్' ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాఖ ఉక్కును కాపాడుకున్నామని, రైల్వే జోన్‌ను సాధించుకున్నామని, ఆగిపోయిన అమరావతి పనులను తిరిగి ప్రారంభించామని తెలిపారు. ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రవాస భారతీయులందరూ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
Nara Lokesh
Andhra Pradesh
APNRT
Australia Telugu Diaspora
Telugu Community
Chandrababu Naidu
AP Elections 2024
Telugu Desam Party
NRI
Investments in AP

More Telugu News