Mohammed: హైదరాబాద్ మెట్రోలో కలకలం.. ప్రయాణికుడి బ్యాగులో బుల్లెట్!

Hyderabad Metro Passenger Caught with Bullet at Moosapet
  • హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యం
  • మూసాపేట స్టేషన్‌లో బ్యాగ్ స్కానింగ్‌లో గుర్తించిన సిబ్బంది
  • బీహార్‌కు చెందిన మహ్మద్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • యువకుడిపై కేసు నమోదు చేసి విచారణ
  • గత నెలలో ఇదే స్టేషన్‌లో కత్తిపోట్ల ఘటన
హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, బీహార్‌కు చెందిన మహ్మద్ అనే యువకుడు ఇక్కడి ప్రగతినగర్‌లో నివసిస్తూ ఓ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి మెట్రో రైలు ఎక్కేందుకు మూసాపేట స్టేషన్‌కు వచ్చాడు. ప్రవేశ ద్వారం వద్ద లగేజీ స్కానింగ్ కోసం తన బ్యాగును యంత్రంలో పెట్టగా, అందులో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై బ్యాగును తనిఖీ చేయగా, అందులో 9 ఎంఎం బుల్లెట్ ఒకటి బయటపడింది.

దీంతో షాక్‌కు గురైన భద్రతా సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి, మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మెట్రో అధికారుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆ బుల్లెట్ యువకుడి వద్దకు ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

కాగా, గత నెలలో ఇదే మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఓ యువతిపై ఆమె ప్రియుడు బ్లేడుతో దాడి చేసి గాయపరిచిన ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ప్రయాణికుడి వద్ద బుల్లెట్ దొరకడంతో మెట్రో స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
Mohammed
Hyderabad Metro
Moosapet Metro Station
Kukatpally Police Station
Metro Security
9mm Bullet
Crime News
Telangana News
Pragathi Nagar
Bihar

More Telugu News