Hemant Soren: ఇండియా కూటమిలో చీలిక.. బీహార్ లో ఆరు చోట్ల జేఎంఎం పోరు

Bihar elections Hemant Soren JMM announces candidates amid seat sharing disagreements
  • మొత్తంగా 12 చోట్ల అభ్యర్థులను నిలబెట్టే యోచనలో హేమంత్ సోరెన్
  • పొత్తు ధర్మాన్ని పాటించి జార్ఖండ్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ కు సీట్లిచ్చామని గుర్తుచేసిన జేఎంఎం ప్రధాన కార్యదర్శి
  • బీహార్ ఎన్నికల తర్వాత పొత్తులపై చర్చిస్తామని వ్యాఖ్య
ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా?.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై చిచ్చు రేగిందా?.. అంటే అవుననే జవాబు వినిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు మహా ఘట్ బంధన్ గా ఏర్పడి బరిలోకి దిగుతున్నాయి. అయితే, ఈ కూటమిలో సీట్ల పంపకంపై చర్చలు ఓ పట్టానా కొలిక్కి రావడంలేదని సమాచారం. ప్రాంతీయ పార్టీగా రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)  కూటమిలో కీలకంగా వ్యవహరిస్తుండగా.. జాతీయ పార్టీగా తమకు తగిన ప్రాధాన్యం దక్కాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. పొత్తు ధర్మంలో భాగంగా తమకు 61 సీట్లు కావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ లతో ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరిపింది. ఈ చర్చలు ఎటూ తేలకపోవడంతో ఆర్జేడీ తన అభ్యర్థులను ప్రకటించి, వారితో నామినేషన్లు కూడా దాఖలు చేయించింది. ఇదిలా ఉండగా.. ఇండియా కూటమిలోని మరో పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. తమకు పన్నెండు సీట్లు కావాలని జేఎంఎం అధినేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. సీట్ల పంపకాలపై ఆర్జేడీ, కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడంతో తాజాగా జేఎంఎం ఆరు చోట్ల తన అభ్యర్థులను ప్రకటించింది.

జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తాజాగా ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి తగిన ప్రాధాన్యం కల్పించామని, పొత్తు ధర్మాన్ని పాటించి ఆర్జేడీ, కాంగ్రెస్ లకు సీట్లు కేటాయించామని ఆయన గుర్తు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము పన్నెండు సీట్లు అడుగుతున్నామని చెప్పారు. ఏదేమైనా పది చోట్ల జేఎంఎం అభ్యర్థులను పోటీకి దింపుతామని భట్టాచార్య స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి పొత్తుపై అన్ని పార్టీలతో చర్చిస్తామని చెప్పారు.
Hemant Soren
India alliance
Bihar elections
JMM
RJD
Congress
Mahagathbandhan
seat sharing
Jharkhand Mukti Morcha
Supriyo Bhattacharya

More Telugu News