డొనాల్డ్ ట్రంప్‌‌కు వ్యతిరేకంగా అమెరికాలో నో కింగ్స్ పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు

  • సంస్కరణల పేరుతో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్
  • ట్రంప్ పాలనా తీరుపై అమెరికా లోపల, అంతర్జాతీయ స్థాయిలోనూ తీవ్ర వ్యతిరేకతలు
  • నో కింగ్స్ పేరుతో దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన పౌర సంఘాలు
  • 50 రాష్ట్రాల్లో 2,500 ప్రాంతాల్లో నిరసనలు
రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు విధానాలతో దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమయ్యారు. సంస్కరణల పేరుతో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేస్తున్నారు. ఈ చర్యలతో ట్రంప్ పాలనపై అమెరికాలో, అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనను "నిరంకుశ పాలకుడు"గా అభివర్ణిస్తూ అమెరికన్లు మరోసారి వీధుల్లోకి వచ్చారు.

'నో కింగ్స్' ఉద్యమం మళ్లీ ఉవ్వెత్తున

'నో కింగ్స్' పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన పౌర సంఘాలు ట్రంప్ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాభై రాష్ట్రాల్లో దాదాపు 2,500 ప్రాంతాల్లో ఈ ఆందోళనలు జరుగుతుండగా, పలు యూరోపియన్ దేశాలు కూడా ట్రంప్ వ్యతిరేక నిరసనలకు మద్దతు తెలుపుతున్నాయి. అమెరికాలో రాజులు లేరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అని ఉద్యమ నిర్వాహకులు పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో #NoKingsProtests హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

మస్క్ ఆధ్వర్యంలో 'డోజ్' - ఉద్యోగాల కోత

పాలనా సంస్కరణల పేరుతో ఎలాన్ మస్క్ నేతృత్వంలో "డోజ్" అనే ప్రత్యేక సంస్కరణ కమిటీని ఏర్పాటు చేసిన ట్రంప్ ప్రభుత్వం వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. జన్మతః పౌరసత్వం, ట్రాన్స్ జెండర్ హక్కులు, అక్రమ వలసలు వంటి అంశాల్లో కీలక మార్పులు తీసుకువచ్చిన ట్రంప్ యంత్రాంగం వలసదారులపై తీవ్ర చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో వలసదారుల ఇళ్లలో సోదాలు, అరెస్టులు జరగడం, నిరసనకారులను అణిచివేసేందుకు జాతీయ బలగాలను మోహరించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.

లక్షలాది మంది వీధుల్లోకి

ఇదివరకే ట్రంప్ జూన్‌లో నిర్వహించిన మిలిటరీ పరేడ్ సమయంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. సెనెట్ నేత చక్ షుమెర్, బెర్నీ సాండెర్స్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఇక, ఇటీవల అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా మూడు వారాలుగా అనేక ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. లక్షలాది మంది ఉద్యోగులపై షట్ డౌన్ ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాలు ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని రగిలించినట్లు తెలుస్తోంది.

ట్రంప్ సమాధానం: "నేను రాజును కాదు"

ఈ నిరసనలపై వైట్‌హౌస్ స్పందిస్తూ, "ఇవి కేవలం 'హేట్ అమెరికా' ర్యాలీలే. దేశానికి వ్యతిరేకంగా ఉన్నవారు వీటిని ప్రోత్సహిస్తున్నారు" అని పేర్కొంది. ట్రంప్ స్వయంగా మాట్లాడుతూ, "నన్ను రాజుగా అంటున్నారు కానీ నేను రాజును కాదు. నేను ప్రజల తరఫున పనిచేస్తున్న అధ్యక్షుడిని" అని అన్నారు.

అమెరికా అంతటా అప్రమత్తత

తాజా నిరసనల నేపథ్యంలో పలు రాష్ట్రాల గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా జాతీయ బలగాలను రంగంలోకి దించారు. పలు ప్రాంతాల్లో నిరసనకారులు ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 


More Telugu News