ప్రశాంత్ కిశోర్ పార్టీ గురించి ఎన్నికల తర్వాత మాట్లాడుకుందాం: అమిత్ షా

  • ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా
  • ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందన్న అమిత్ షా
  • కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారో, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదని ఎద్దేవా
ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ గురించి ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడుకుందామని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ, బీహార్‌లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని, వారి కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారో, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వారికే తెలియదని ఎద్దేవా చేశారు.

మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బీహార్‌లో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కిడ్నాప్‌లు, కుల ఘర్షణలకు తెరపడిందని అమిత్ షా అన్నారు. గత పాలనలో బీహార్‌లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, గత ఇరవై ఏళ్ల కాలంలో దానిని పూడ్చామని తెలిపారు. ఇప్పుడు బలమైన పునాదులపై నిర్మాణాలు చేపడతామని ఆయన అన్నారు.

కొత్త ముసుగు ధరించి ఆటవిక రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలని ఆశిస్తున్న వారిని ఓటర్లు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో పరిశ్రమలకు సరిపడే భూములు లేకపోవచ్చని, కానీ నాణ్యమైన శ్రామిక శక్తి ఉందని అన్నారు. రాష్ట్రాన్ని ఏఐ హబ్‌గా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.


More Telugu News