Ashwini Vaishnaw: గ్లోబల్ మార్కెట్‌కు భారత్ సవాల్.. స్వదేశీ చిప్‌ను ప్రదర్శించిన అశ్విని వైష్ణవ్

Ashwini Vaishnaw showcases indigenous chip challenges global market
  • ఢిల్లీలో ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో మాట్లాడిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
  • స్వదేశీయంగా తయారైన సెమీకండక్టర్ వేఫర్‌ను సభలో ప్రదర్శన
  • భారతదేశ డేటా దేశ సరిహద్దుల లోపలే ఉండాలని స్పష్టీకరణ
  • అత్యంత సంక్లిష్టమైన 2 నానోమీటర్ల చిప్‌లను డిజైన్ చేస్తున్న భారత్
  • ప్రపంచ చిప్ డిజైనర్లలో 20 శాతం మంది మన దేశంలోనే ఉన్నారని వెల్లడి
భారతదేశపు సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటిచెబుతూ కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. అత్యంత సంక్లిష్టమైన 2 నానోమీటర్ల సెమీకండక్టర్ చిప్‌లను మన దేశంలోనే డిజైన్ చేస్తున్నామని, ఈ రంగంలో ప్రపంచ మార్కెట్‌ను శాసించే సత్తా భారత్‌కు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ‘ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్’లో ప్రసంగించిన ఆయన, స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఒక సెమీకండక్టర్ వేఫర్‌ను చేతిలోకి తీసుకుని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ప్రపంచంలోని మొత్తం గ్లోబల్ చిప్ డిజైన్ ఇంజనీర్లలో ఇప్పటికే 20 శాతం మంది మన దేశంలోనే ఉన్నారు. ఇది మనకు ఒక ప్రత్యేకమైన బలాన్ని ఇచ్చింది. గతంలో 5 లేదా 7 నానోమీటర్ల చిప్‌లను డిజైన్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అత్యంత చిన్నవి, సంక్లిష్టమైనవి అయిన 2 నానోమీటర్ల చిప్‌లను ఇక్కడే డిజైన్ చేస్తున్నాం" అని వివరించారు.

చిప్ తయారీ అనేది ఎంత క్లిష్టమైన ప్రక్రియో ఆయన సులభంగా పోల్చి చెప్పారు. "ఒక చిన్న వేఫర్‌పై ఒక పూర్తి నగరాన్ని నిర్మించడం లాంటిది ఈ ప్రక్రియ. దానికి దాని సొంత ప్లంబింగ్, హీటింగ్, ఎలక్ట్రికల్ నెట్‌వర్క్, సర్క్యూట్‌లు అన్నీ ఉంటాయి. చిప్‌లోని సర్క్యూట్‌లు మానవ వెంట్రుక కంటే 10,000 రెట్లు చిన్నవిగా ఉంటాయి" అని తెలిపారు. చిప్ తయారీ పరిశ్రమలో ఐదు నిమిషాలు విద్యుత్ సరఫరా నిలిచిపోతే 200 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఒకరు తనతో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

అదేవిధంగా, డేటా సార్వభౌమాధికారం ప్రాముఖ్యతను వైష్ణవ్ నొక్కిచెప్పారు. "డేటాయే కొత్త ఆయిల్. డేటా సెంటర్లు కొత్త రిఫైనరీలు. నేటి ఆర్థిక వ్యవస్థలో రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త ఆర్థికశక్తిపై మనకే నియంత్రణ ఉండాలి. మన దేశంలోని ప్రతిభావంతులకు ఇక్కడే అవకాశాలు లభించేలా చూడాలి" అని ఆయన స్పష్టం చేశారు. భారతదేశానికి సంబంధించిన డేటా భౌగోళికంగా దేశ సరిహద్దుల్లోపలే ఉండాలని ఆయన గట్టిగా చెప్పారు. డిజిటల్ క్రెడిట్, వేగవంతమైన మొబైల్ డేటా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎమ్) వంటివి భారతదేశ డిజిటల్ వృద్ధి ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అశ్విని వైష్ణవ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 
Ashwini Vaishnaw
Semiconductor chip
2 nanometer chip
Chip design
Make in India
Data sovereignty
Digital economy
Global market
NDTV World Summit
Semiconductor wafer

More Telugu News