జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక... కాంగ్రెస్ కు సీపీఐ సంపూర్ణ మద్దతు

  • కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు అండగా ఉంటామని ప్రకటన
  • హైదరాబాద్ మక్దూం భవన్‌లో టీపీసీసీ చీఫ్, సీపీఐ ముఖ్య నేతల భేటీ
  • బీజేపీ ప్రమాదకర శక్తిగా మారిందన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి దాని మిత్రపక్షమైన సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన విజ్ఞప్తికి సీపీఐ నేతలు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దూం భవన్‌లో ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు.

ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ నాయకులు కె.నారాయణ, చాడ వెంకట్ రెడ్డి తదితర ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు, బీసీ బంద్ నిర్వహణ అంశాలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది.

అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, "మిత్రపక్షాల ఐక్యతే మా బలం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సీపీఐ మద్దతుగా నిలుస్తోంది. ఈ స్నేహం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు" అని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, కాంగ్రెస్‌తో తమ పొత్తు 2023 నుంచి కొనసాగుతోందని గుర్తుచేశారు. "మహేశ్ కుమార్ గౌడ్ మా మద్దతు కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటూనే, అవసరమైనప్పుడు నిర్మాణాత్మక సూచనలు ఇస్తున్నాం" అని తెలిపారు. బీజేపీ దేశానికి ప్రమాదకర శక్తిగా మారిందని, బీఆర్ఎస్ బీజేపీకి అనుబంధ సంస్థగా మారే ప్రమాదం కనిపిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.


More Telugu News