TTD: తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు: జనవరి కోటా విడుదల షెడ్యూల్ ఇదే!

TTD Announces January 2026 Tirumala Darshan Ticket Release Schedule
  • అక్టోబర్ 19న ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ నమోదు
  • 23న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, వర్చువల్ సేవల టికెట్లు
  • 24న శ్రీవాణి, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్ల విడుదల
  • 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కోటా
  • అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచన
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని 2026 జనవరి నెలలో దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్ టికెట్ల విడుదల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదులకు సంబంధించిన కోటాను ఈ నెలలో దశలవారీగా విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భక్తులు తమ ప్రణాళికలకు అనుగుణంగా ఈ తేదీలను గమనించి, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

తేదీల వారీగా విడుదల వివరాలు ఇలా ఉన్నాయి

అక్టోబర్ 19
వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన), అంగ ప్రదక్షిణ టోకెన్ల కోసం అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. భక్తులు అక్టోబర్ 21 ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 23 మధ్యాహ్నం 12 గంటలలోపు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

అక్టోబర్ 23
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను భక్తులకు అందుబాటులో ఉంచుతారు.

అక్టోబర్ 24
శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందించిన భక్తులకు కేటాయించే దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

అక్టోబర్ 25
భక్తులు అత్యధికంగా ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో వసతి గదుల కోటాను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకువస్తారు.

పైన పేర్కొన్న అన్ని సేవలు, దర్శన టికెట్లు, గదుల బుకింగ్ కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సంప్రదించాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి విజ్ఞప్తి చేశారు.
TTD
Tirumala
Tirumala Tirupati Devasthanams
Sri Venkateswara Swamy
January 2026 tickets
arjitha seva tickets
special entry darshan
accommodation booking
Srivani Trust
virtual seva

More Telugu News