Revanth Reddy: రేవంత్ రెడ్డి గన్ కల్చర్ తీసుకువచ్చారు.. వ్యాపారవేత్తలకు తుపాకులు చూపించి బెదిరిస్తున్నారు: హరీశ్ రావు

Harish Rao slams Revanth Reddy for gun culture in Telangana
  • కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణ
  • కేటీఆర్ వర్షం పడుతుంటే గుర్నానీకి గొడుకు పట్టి పెట్టుబడులను ఆహ్వానించారని వ్యాఖ్య
  • ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని నిలదీత
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు తుపాకులు చూపి వ్యాపారవేత్తలను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో కేటీఆర్ వర్షంలో సైతం టెక్ మహీంద్ర సీఈవో గుర్నానీకి గొడుగు పట్టి పెట్టుబడులను ఆహ్వానించిన చరిత్ర తమదని గుర్తు చేశారు. తెలంగాణలో పెట్టుబడులు తగ్గిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రభుత్వ విజయోత్సవాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ చెబుతోందని, అయితే తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడినందుకు ఈ ఉత్సవాలు చేస్తున్నారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. కాంట్రాక్టుల కోసం మంత్రివర్గ సమావేశంలో మంత్రులు కొట్లాడుకుంటున్నారని, వారి మధ్య తగాదాలు పెరిగి రోజూ వీధిన పడి పరువు తీస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా అని ఆయన ధ్వజమెత్తారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ప్రాజెక్టులు కట్టలేదని, పైగా ఉన్న పథకాలను రద్దు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే విజయోత్సవాలు జరుపుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, సినీ పరిశ్రమ పెద్దలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పేదలకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణను సాధించి, పదేళ్లు అద్భుతంగా పాలించిన తమ పార్టీకి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ తలుపులు ప్రతి ఒక్కరికీ తెరిచే ఉంటాయని ఆయన అన్నారు.

డీజీపీ శివధర్ రెడ్డి ఖాకీ బుక్‍‌లో మంత్రులకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా అని హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో పింక్ బుక్, రెడ్ బుక్, బ్లూ బుక్ లేవని డీజీపీ ఇటీవల చెప్పారని, కానీ స్వయంగా మంత్రి కుటుంబ సభ్యులే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాల్లో రీట్వీట్ చేస్తేనే రాత్రికి రాత్రి అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. కొంతమంది తుపాకులు పట్టుకుని తిరుగుతుంటే డీజీపీకి కనిపించడం లేదా అని నిలదీశారు.

తెలంగాణలో మంత్రుల పంచాయితులను పరిష్కరించేందుకు మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కమీషన్ కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం మరొకరు, వాటాల కోసం మరొకరు, అక్రమ వసూళ్ల కోసం, కబ్జాల కోసం మంత్రులు వర్గాలుగా విడిపోయారని ఆయన ఆరోపించారు. మంత్రివర్గ సమావేశం దండుపాళ్యం ముఠాలా మారిపోయిందని ఆయన విమర్శించారు. గత కొన్ని రోజులుగా మంత్రుల మధ్య తగాదాలే చూస్తున్నామని, పాలన గాలికి వదిలేశారని ఆయన అన్నారు.
Revanth Reddy
Harish Rao
Telangana politics
BRS party
Gun culture
Illegal collections
Investment decline

More Telugu News