Chandrababu Naidu: వడ్డెర్లకు చేయూతనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Government Supports Vadde Community with Mining Leases
  • మైనింగ్ లీజుల్లో వడ్డెర కులస్తులకు 15 శాతం రిజర్వేషన్లు
  • సీనరేజి, ప్రీమియంలో 50 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం
  • రాష్ట్ర ఖనిజ సంపదపై పూర్తిస్థాయి అధ్యయనానికి సీఎం ఆదేశం
  • గనుల తవ్వకాలపై శాటిలైట్, డ్రోన్లతో పటిష్ఠ నిఘా
  • ఉచిత ఇసుక విధానం సామాన్యుడికి చేరేలా చూడాలని స్పష్టం
  • పెండింగ్‌లో ఉన్న 6,500 మైనింగ్ దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో వడ్డెర సామాజిక వర్గానికి ఆర్థికంగా చేయూతనిచ్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మైనింగ్ లీజుల కేటాయింపులో వారికి 15 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన విధానాన్ని తక్షణమే రూపొందించాలని గనుల శాఖ అధికారులను ఆదేశించారు. సీనరేజి, ప్రీమియం వంటి చెల్లింపుల్లో వారికి 50 శాతం రాయితీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేసి, తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చకు తీసుకురావాలని సూచించారు.

శుక్రవారం సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖ, ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వడ్డెర్లకు లీజులు కేటాయించడమే కాకుండా, వారిని ఎంఎస్ఎంఈలుగా ప్రోత్సహించేలా ప్రస్తుత పాలసీలతో అనుసంధానం చేయాలని దిశానిర్దేశం చేశారు.

వెనుకబడిన వర్గాలైన వడ్డెర్లకు ఆర్ధిక ప్రయోజనాలు కలిగేలా లీజు కేటాయింపు విధానాన్ని రూపోందించాలని సీఎం స్పష్టం చేశారు. మైనింగ్ లీజుల కేటాయింపుతో పాటు వారు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేందుకు కూడా ప్రస్తుతం ఉన్న పాలసీని అనుసంధానించాలని అన్నారు. 

ఉచిత ఇసుకతో ప్రజలకే ప్రయోజనం దక్కాలి

ఇక, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలందరికీ ప్రయోజనం కలగాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ఉచిత ఇసుక సరఫరాను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవస్థలో ఉన్న లోపాలను వినియోగించుకుని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సీజన్ కోసం 66.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేశామని... ప్రస్తుతం అన్ని స్టాక్ పాయింట్లలోనూ 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 

దీనిపై సీఎం స్పందిస్తూ చిట్టచివరి వ్యక్తికీ ప్రయోజనం దక్కేలా ఇసుక లభ్యత జరగాలని అన్నారు. ఇసుక లోడింగ్ తో పాటు రవాణాకు అతితక్కువ వ్యయం అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక లభ్యతపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని రూట్లలో పెట్టిన సీసీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేయాలని సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా ఉచిత పంపిణీ విధానంపై పర్యవేక్షించాలని సీఎం అన్నారు. 

 విలువ జోడింపుతోనే అదనపు ఆదాయం

రాష్ట్రంలో లభ్యం అవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గనుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఖనిజాలకు విలువ జోడింపుతోనే అదనపు ఆదాయం వస్తుందని సీఎం సూచించారు. మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా 2025-26 ఆర్ధిక సంవత్సరానికి రూ.3320 కోట్ల ఆదాయార్జనను లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతంతో పోలిస్తే 34 శాతం మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72 శాతానికి పైగా ఆదాయం వస్తోందని వివరించారు. 

దీనిపై స్పందించిన సీఎం ఏపీలో ఉన్న మినరల్ వెల్త్ విలువను అంచనా వేయాలని సూచించారు. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో వాల్యూ ఎడిషన్ ద్వారా ఎక్కువగా ఆదాయాన్ని పొందుతున్నారని.. రూ.50 వేల కోట్ల ఆదాయం ఖనిజాల నుంచే వస్తోందని సీఎం తెలిపారు. ఏపీలోనూ అందుకు తగిన విజన్ ప్లాన్ తయారు చేసి విలువ జోడిస్తే రూ.20-30 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. పెండింగ్ లో ఉన్న 6500 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో గనుల తవ్వకాలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఆధారిత టెక్నాలజీతో విశ్లేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇచ్చిన పర్మిట్లు, జరిగిన తవ్వకాలు ఎంత అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించాలన్నారు. అనలటిక్స్ ను వినియోగించుకుని జరిగిన తవ్వకాలను అంచనా వేయాలన్నారు. బీచ్ శాండ్ మినరల్స్ లాంటి భార ఖనిజాల మైనింగ్ తో పాటు విలువ జోడింపు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. అలాగే కడపలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ కు ముడి ఇనుము ఖనిజం సరఫరా పై కూడా అధ్యయనం చేయాలని సూచించారు.

ఈ సమీక్షకు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీఎస్ అధికారులు హాజరయ్యారు.

Chandrababu Naidu
Andhra Pradesh
mining leases
Vadde community
free sand policy
mineral resources
MSME
revenue generation
Kollu Ravindra
AP minerals

More Telugu News