Cyber Crime: లండన్‌లో కుమారుడికి ప్రమాదం జరిగిందని నమ్మించి రూ. 35 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు

Cyber Crime 35 Lakhs Fraud in Hyderabad Believing Son Had Accident in London
  • హైదరాబాద్‌కు చెందిన వృద్ధురాలికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్
  • లండన్‌లో మీ కుమారుడికి ప్రమాదం జరిగిందని తలకు బలమైన గాయమైందని నమ్మబలికిన సైబర్ నేరగాడు
  • మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
లండన్‌‍లో మీ కుమారుడికి ప్రమాదం జరిగిందని నమ్మించి సైబర్ నేరగాడు హైదరాబాద్ లోని ఓ వృద్ధురాలి నుంచి రూ. 35 లక్షలు కాజేసిన ఘటన కలకలం సృష్టించింది. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరానికి చెందిన 61 ఏళ్ల వృద్ధురాలికి ఒక వ్యక్తి వాట్సాప్ కాల్ చేశాడు. తన పేరు స్టీవ్ అని, లండన్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు.

లండన్ విమానాశ్రయంలో మీ కుమారుడికి ప్రమాదం జరిగిందని, తలకు బలమైన గాయాలయ్యాయని ఆ వృద్ధురాలికి చెప్పాడు. లగేజీ మిస్ కావడంతో ఎలాంటి ఐడెంటిటీ లేకుండా పోయిందని, ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదని నమ్మబలికాడు. ఎలాగైనా తన కుమారుడికి చికిత్స అందించాలని ఆ వృద్ధురాలు ప్రాధేయపడింది. చికిత్స కోసం విడతలవారీగా రూ. 35 లక్షలకు పైగా పంపించింది.

తన కుమారుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి ఫొటో, వీడియో పంపించాలని కోరగా, ఆ వ్యక్తి అందుకు నిరాకరించాడు. అనుమానం వచ్చిన బాధితురాలు కొడుకును సంప్రదించింది. తాను క్షేమంగా ఉన్నానని, ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Cyber Crime
Hyderabad Cyber Crime
Online Fraud
Cyber Fraud
WhatsApp Fraud
London
Cyber Criminals

More Telugu News