Donald Trump: హెచ్-1బీ ఫీజుల పెంపు: ట్రంప్ సర్కార్‌ను కోర్టుకు లాగిన చాంబర్ ఆఫ్ కామర్స్

Donald Trump H1B Fee Hike Challenged by Chamber of Commerce
  • హెచ్-1బీ వీసా ఫీజుపై ట్రంప్ సర్కార్‌కు ఊహించని షాక్
  • కొత్తగా లక్ష డాలర్ల ఫీజు విధించడం చట్టవిరుద్ధమని దావా
  • ఈ నిర్ణయం అమెరికా ప్రయోజనాలకు నష్టమని వాణిజ్య వర్గాల ఆందోళన
వలస విధానాలపై దూకుడుగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయానికి ఆయన సొంత దేశంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా లక్ష డాలర్ల (సుమారు రూ.88 లక్షలు) ఫీజు విధించాలన్న ఆయన ప్రతిపాదనను సవాలు చేస్తూ, దేశంలోని ప్రముఖ వాణిజ్య సంస్థ ‘యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్’ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు కొలంబియా జిల్లా కోర్టులో గురువారం దావా దాఖలు చేసింది. ట్రంప్ సర్కార్ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలను, పోటీతత్వాన్ని దెబ్బతీసేలా ఉందని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని తన పిటిషన్‌లో పేర్కొంది.

సెప్టెంబర్ 19న ట్రంప్ జారీ చేసిన ఈ ప్రకటన ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టాన్ని ఉల్లంఘిస్తోందని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆరోపించింది. వీసాలపై కాంగ్రెస్‌కు ఉన్న అధికారాన్ని అధ్యక్షుడు అతిక్రమించారని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో హోంల్యాండ్ సెక్యూరిటీ, విదేశాంగ శాఖలతో పాటు వాటి కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ నిర్ణయంపై చాంబర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ బ్రాడ్లీ మాట్లాడుతూ, "ఈ భారీ ఫీజు వల్ల స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా సంస్థలు విదేశీ నిపుణులను నియమించుకోవడం దాదాపు అసాధ్యంగా మారుతుంది" అని ఆందోళన వ్యక్తం చేశారు.

అధ్యక్షుడికి విస్తృత అధికారాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ చేసిన చట్టాలను ఆయన ఉల్లంఘించలేరని చాంబర్ తన వాదన వినిపించింది. హెచ్-1బీ వీసా హోల్డర్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తున్నారని, వారు కొత్త ఉద్యోగాలు సృష్టించడంతో పాటు అమెరికన్ల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఆవిష్కరణలకు కారణమవుతున్నారని తెలిపింది. ట్రంప్ తాజా నిర్ణయం ఈ ప్రగతిని తారుమారు చేస్తుందని హెచ్చరించింది.

ఈ నిబంధన వల్ల అత్యధికంగా నష్టపోయేది భారతీయ నిపుణులే. ఇటీవలి కాలంలో జారీ అయిన మొత్తం హెచ్-1బీ వీసాలలో 71 శాతం భారతీయులవే కావడం గమనార్హం. ఒకవైపు అమెరికా ఇలాంటి కఠిన నిబంధనలు విధిస్తుండగా, మరోవైపు చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించేందుకు 'కే-వీసా' పేరుతో కొత్త వర్క్ పర్మిట్‌ను ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 
Donald Trump
H-1B visa
US Chamber of Commerce
immigration
visa fees
Indian professionals
K-visa China
US economy
foreign workers
Neil Bradley

More Telugu News