Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. అద్దె ఇంటి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా!

Secret Camera Found in Hyderabad Rental House Bathroom
  • హైదరాబాద్ మధురానగర్‌లో అద్దె ఇంట్లో ఓనర్ నిర్వాకం
  • బాత్రూంలోని బల్బులో రహస్యంగా కెమెరా ఏర్పాటు
  • నిఘా కెమెరాను గుర్తించి షాకైన అద్దెదారుడు
హైదరాబాద్ నగరంలో అద్దెకు నివసించే వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసే దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. తాము సురక్షితంగా ఉన్నామనుకునే ఇంట్లోనే ఓ యజమాని నీచమైన చర్యకు పాల్పడ్డాడు. నగరంలోని మధురానగర్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్న వ్యక్తి బాత్రూంలో అమర్చిన బల్బులో రహస్య కెమెరా ఉండటాన్ని గుర్తించి నివ్వెరపోయాడు. ఈ ఘటన ఇప్పుడు నగరవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే, మధురానగర్‌లోని ఓ ఇంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు. అద్దెకు ఉంటున్న వ్యక్తికి బాత్రూంలోని బల్బుపై అనుమానం వచ్చింది. దాన్ని పరిశీలించగా, అందులో అత్యంత చాకచక్యంగా అమర్చిన సీక్రెట్ కెమెరా కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఇంటి ఓనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలో హాస్టళ్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్‌లో మాత్రమే ఇలాంటి ఘటనలు బయటపడేవి. కానీ ఇప్పుడు ఏకంగా అద్దె ఇళ్లలోని బాత్రూంలు, బెడ్‌రూంలలో కూడా ఇలాంటివి జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి లక్షలాది మంది అద్దె ఇళ్లలో నివసించే హైదరాబాద్‌లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అద్దె ఇంట్లోకి మారే ముందు బాత్రూంలు, బెడ్‌రూంలలోని బల్బులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం మంచిదని ఈ వీడియో చూసిన నెటిజన్లు సూచిస్తున్నారు. అద్దె ఇళ్లలో కూడా భద్రత కరవైతే ఎలా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
Hyderabad
Hyderabad crime
Secret camera
Madhuranagar
Rental house
Bathroom camera
Hidden camera
Cyber crime
Tenant safety

More Telugu News