Revanth Reddy: స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Revanth Reddy Govt Scraps Two Child Rule for Local Polls
  • ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధన తొలగించి చట్టాన్ని మార్చేందుకు ఆమోదం
  • ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని మంత్రివర్గం నిర్ణయం
  • రాష్ట్రంలో కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు నిబంధనపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించి, చట్టాన్ని మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా పోటీకి అర్హులవుతారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశం వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు. పలు రంగాలకు భూకేటాయింపులు జరిపేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ కూడా ఇస్తామని తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. నల్సార్‌లో స్థానిక విద్యార్థులకు 50 శాతం సీట్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేసిందని అన్నారు. నల్సార్ యూనివర్సిటీకి గతంలో ఇచ్చిన దానికంటే అదనంగా 7 ఎకరాలు ఇస్తామని, రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.

కేంద్రం కొనుగోలు చేసినా చేయకపోయినా తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని వేశామని అన్నారు. మెట్రో రెండో దశను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీఎస్ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Revanth Reddy
Telangana local body elections
Telangana government
Three child rule
Local body elections eligibility

More Telugu News