Chandrababu Naidu: బీహార్ లో ఎన్డీయే విజయం ఖాయమన్న చంద్రబాబు... ఏపీ సీఎం హిందీ ప్రసంగానికి ప్రధాని మోదీ ఫిదా

Chandrababu Predicts NDA Win in Bihar Modi Praises Hindi Speech
  • కర్నూలు సభలో హిందీలో ప్రసంగించిన చంద్రబాబు
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేదే విజయం అని ఉద్ఘాటన 
  • ప్రధాని మోదీ విజయయాత్ర కొనసాగుతుందని ధీమా
  • చంద్రబాబు హిందీ ప్రసంగాన్ని మెచ్చుకున్న ప్రధాని
కర్నూలు జిల్లా నన్నూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హిందీలో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేయగా, చంద్రబాబు ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

గురువారం ప్రధాని మోదీతో కలిసి వేదిక పంచుకున్న చంద్రబాబు, ముందుగా రాసుకున్న పత్రాన్ని చూస్తూ హిందీలో మాట్లాడారు. "బీహార్‌లో ఎన్డీయే కచ్చితంగా విజయం సాధిస్తుంది, ప్రధాని మోదీ విజయయాత్ర ముందుకు సాగుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది" అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సాధించే ప్రతి విజయం, యావత్ భారతదేశ విజయమని ఆయన అన్నారు. 

దేశ ప్రగతిని కొనసాగించేందుకు, 'వికసిత్ భారత్' కలను సాకారం చేసేందుకు ప్రధాని మోదీకి శక్తినివ్వాలని శ్రీశైలం బ్రమరాంబ మల్లికార్జున స్వామిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు రెట్టింపు ప్రయోజనాలు కలుగుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని మోదీ మద్దతుతో రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.

గత 16 నెలలుగా రాష్ట్రానికి ప్రధాని అందిస్తున్న సహాయాన్ని మర్చిపోలేమని, కేంద్రం సహకారంతోనే అమరావతి పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని, పోలవరం ప్రాజెక్టు గాడిన పడిందని, విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపేతం చేశామని గుర్తుచేశారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల 99 శాతం వస్తువులు 0 నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చి పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ప్రతి కుటుంబానికి ఏటా రూ. 15,000 వరకు ఆదా అవుతుందని వివరించారు. ప్రధాని మోదీ 'స్వదేశీ' పిలుపుతో దేశంలో సెమీకండక్టర్ల నుంచి శాటిలైట్ల వరకు, చిప్స్ నుంచి షిప్‌ల వరకు అన్నీ దేశీయంగానే తయారవుతున్నాయని ఆయన ప్రశంసించారు.

చంద్రబాబు హిందీ ప్రసంగంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. "చంద్రబాబు గారు ఇంత చక్కగా హిందీలో మాట్లాడి బీహార్‌లోని ఎన్డీయే కార్యకర్తల హృదయాలను గెలుచుకున్నారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు" అని ప్రధాని కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు హిందీ ప్రసంగం వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.

Chandrababu Naidu
Bihar Elections
NDA victory
Narendra Modi
Telugu Desam Party
Andhra Pradesh
Hindi speech
AP CM
Nannur
Double Engine Government

More Telugu News