Konda Surekha: నిన్న రాత్రి ఏం జరిగిందంటే!: పార్టీ పెద్దలకు వివరించిన కొండా సురేఖ

Konda Surekha Explains Last Nights Events to Party Leaders
  • మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసిన కొండా సురేఖ
  • తన విషయంలో జరుగుతున్న పరిణామాలను వారికి తెలిపిన కొండా సురేఖ
  • సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారన్న మంత్రి
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లను కలిసి నిన్న రాత్రి తన ఇంటి వద్దకు పోలీసులు వచ్చిన సమయంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలను వారికి వివరించారు. గత కొంతకాలంగా తన విషయంలో జరుగుతున్న అంశాలను ఆమె వారికి తెలియజేశారు.

భేటీ అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తన సమస్యను పరిష్కరించడానికి పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. వారు ఈ విషయాన్ని పరిష్కరిస్తామని చెప్పారని, కాబట్టి మిగిలిన విషయాలను వారే చూసుకుంటారనే నమ్మకంతో ఉన్నానని అన్నారు.

గత కొన్ని రోజులుగా తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని కొండా సురేఖ మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్‌లకు వివరించినట్లు తెలుస్తోంది. తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. డెక్కన్ సిమెంట్ యాజమాన్యం వ్యవహారంలో జరిగిన పరిణామాలను, వారితో జరిగిన చర్చలు, ఆ సంస్థ అక్రమాలు తదితర విషయాలను ఆమె తెలియజేశారు.

సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను బెదిరిస్తున్నారనే ఆరోపణలతో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. సురేఖ నివాసంలో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు అక్కడకి చేరుకున్నారు. మంత్రి కుమార్తె సుస్మిత వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో సుస్మిత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దలపై విమర్శలు చేశారు.
Konda Surekha
Telangana
Congress Party
Meenakshi Natarajan
Mahesh Kumar Goud
Deccan Cements

More Telugu News