Sajjanar: సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయ్యేందుకు చిన్నారులతో అసభ్యకర కంటెంట్.. తీవ్రంగా స్పందించిన సజ్జనార్

Sajjanar Condemns Inappropriate Content with Children on Social Media
  • వ్యూస్ మాటలో పడి విలువలు మరిచిపోతే ఎలాగని ప్రశ్న
  • చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం సరికాదన్న హైదరాబాద్ సీపీ
  • సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీత
వ్యూస్ వ్యామోహంలో విలువలు విస్మరిస్తే ఎలాగని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రశ్నించారు. కేవలం వ్యూస్, లైక్స్‌ కోసం సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందడానికి చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం సముచితం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పిల్లలతో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలను ఉద్దేశించి ఆయన 'ఎక్స్' వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్ సృష్టిస్తూ సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చిన్నారులు, యువతకు స్ఫూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. పిల్లలతో ఇష్టానుసారంగా వీడియోలు చేసి వారిని తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. ఇటువంటి చర్యలు పోక్సో, జువైనల్ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తాయని, ఇది పిల్లలను వేధించినట్టు అవుతుందని ఆయన అన్నారు.

మైనర్లతో సహా ఈ తరహా కంటెంట్ సృష్టించి వారి పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలతో రూపొందించే అసభ్యకరమైన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని ఆయన తేల్చి చెప్పారు.

అలా జరగని పక్షంలో చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి వీడియోలు కనిపిస్తే వెంటనే రిపోర్టు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిల్లలను పెంచడంతో పాటు వారి బాల్యం, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును కాపాడటం కూడా తల్లిదండ్రుల బాధ్యత అని ఆయన గుర్తు చేశారు.
Sajjanar
VC Sajjanar
Hyderabad CP
Social Media Content
Children Content
YouTube Channels

More Telugu News