Podili Narasamma: నట్టింట్లో తల్లి మృతదేహం.. నగల కోసం కూతుళ్ల పంచాయితీ

Mothers Body at Home Daughters Dispute Over Gold
  • తల్లి మరణించి మూడు రోజులైనా అంత్యక్రియలు చేయని వైనం
  • సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఘటన
  • కన్నతల్లిని కోల్పోయినందుకు బాధపడకుండా డబ్బు, నగలు దక్కవేమోనని ఏడుపు
కన్నతల్లి మృతదేహం ముందే కూతుళ్లు నగల కోసం పోట్లాడుకున్న ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది. తల్లి దాచిన డబ్బు, నగల కోసం చివరకు మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఆపడం విస్మయం కలిగిస్తోంది. మూడు రోజులుగా మృతదేహాన్ని నట్టింట్లో పెట్టుకుని మరీ నగల లెక్కల కోసం కూతుళ్లు పట్టుబట్టడంపై చుట్టుపక్కల వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయినా సరే డబ్బు, నగల వాటా తేలాకే అంత్యక్రియలు చేస్తామని ఆ కూతుళ్లు స్పష్టం చేయడం గమనార్హం. రక్తసంబంధాలకే మచ్చలా మారిన ఈ విషాదకర ఘటన వివరాలు..

ఆత్మకూరు ఎస్ మండల కేంద్రానికి చెందిన పొదిలి నరసమ్మ అనే వృద్ధురాలు మూడు రోజుల కింద మరణించింది. విషయం తెలిసి పుట్టింటికి వచ్చిన నరసమ్మ ఇద్దరు కూతుళ్లు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం మాని తల్లి దాచిన డబ్బు, నగల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. తల్లి మృతదేహాన్ని ఐస్ బాక్సులో పెట్టి పంచాయితీ పెట్టుకున్నారు. తల్లి వద్ద రూ. 12 లక్షలు, 6 తులాల బంగారం కోసం గొడవ పడ్డారు. నరసమ్మకు చెందిన 8 ఎకరాల వ్యవసాయ భూమిని గతంలోనే కూతుళ్లు ఇద్దరూ చెరిసగం పంచుకున్నారు. 

ఇప్పుడు డబ్బు, నగల వాటా విషయం తేలే వరకూ తల్లికి అంత్యక్రియలు చేసేది లేదని కూతుళ్లు పంతం పట్టారు. అంత్యక్రియల తర్వాత ఆస్తుల లెక్క తేల్చుకోండని బంధువులు, ఇరుగుపొరుగు వారు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కూతుళ్లు వినడంలేదు. దీంతో విసిగిపోయిన బంధువులు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. చివరకు పోలీసులు చెప్పినా వినకుండా తల్లి నగల కోసం కూతుళ్లు పట్టుబట్టడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Podili Narasamma
Suryapet district
Atmakur
daughters dispute
gold
property dispute
funeral delay
money
inheritance
crime news

More Telugu News