ఢిల్లీ హైకోర్టు వర్చువల్ విచారణ.. కెమెరా ఆన్‌లో ఉండగానే మహిళకు లాయర్ ముద్దు.. వీడియో ఇదిగో!

  • న్యాయమూర్తి రాకముందే ఘటన!
  • లాయర్ తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం
  • వృత్తిగత ప్రవర్తనపై వెల్లువెత్తుతున్న విమర్శలు
న్యాయస్థానంలో వృత్తిగత హుందాతనాన్ని ప్రదర్శించాల్సిన ఓ న్యాయవాది అనుచితంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఢిల్లీ హైకోర్టులో ఓ కేసు వర్చువల్ విచారణ సందర్భంగా కెమెరా ఆన్‌లో ఉండగానే ఆయన ఓ మహిళను ముద్దుపెట్టుకోవడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సదరు లాయర్ తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ విచారణ కోసం అందరూ లాగిన్ అయి న్యాయమూర్తి రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కోర్టు దుస్తుల్లో ఉన్న ఆ లాయర్, తన కెమెరాకు కొద్దిగా పక్కకు కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ఆయన ముందు నిల్చుని ఉన్న చీర కట్టుకున్న మహిళ చేతిని పట్టుకుని దగ్గరకు లాగారు. ఆమె కాస్త వెనక్కి తగ్గేందుకు ప్రయత్నించినా, ఆయన ఆమెకు ముద్దుపెట్టడం వీడియోలో స్పష్టంగా రికార్డయింది.

ఈ వీడియోలో ఉన్న లాయర్, మహిళ ఎవరనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ వీడియో ప్రామాణికతను తాము ధృవీకరించలేమని కొన్ని జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"ఇది చాలా సిగ్గుచేటు" అని ఒకరు వ్యాఖ్యానించగా, "న్యాయవ్యవస్థ పవిత్రతను దెబ్బతీసే చర్య" అని మరికొందరు అభిప్రాయపడ్డారు. "న్యాయం గుడ్డిది కావచ్చు, కానీ ఇప్పుడు కెమెరాలో బందీ అయింది" అంటూ కొందరు వ్యంగ్యంగా స్పందించారు. వృత్తిగత నియమావళిని ఉల్లంఘించిన లాయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన న్యాయవాదుల ప్రవర్తన, వర్చువల్ విచారణల పర్యవేక్షణపై కొత్త చర్చకు దారితీసింది.


More Telugu News