Andhra Pradesh Government: ఏపీలో చికెన్ వ్యాపారులకు అలర్ట్.. కొత్త విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం

Andhra Pradesh Government Introduces New Rules for Chicken Business
  • ఏపీలో చికెన్ దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి
  • ప్రజలకు నాణ్యమైన చికెన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం
  • పౌల్ట్రీ నుంచి దుకాణం వరకు కోళ్ల సరఫరాపై పర్యవేక్షణ
ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ వ్యాపారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా చికెన్ దుకాణాలకు లైసెన్సింగ్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనతో అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది.

ఈ నూతన విధానం ద్వారా కోళ్ల సరఫరా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. ఏ పౌల్ట్రీ ఫారం నుంచి ఎన్ని కోళ్లు ఏ దుకాణానికి వెళ్తున్నాయి, రోజువారీ అమ్మకాల వివరాలు.. వంటి సమాచారాన్ని పక్కాగా నమోదు చేయనున్నారు. దీనివల్ల కోళ్ల ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి చేరే వరకు ప్రతి దశను ట్రాక్ చేయడం సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

అంతేకాకుండా, ఆరోగ్యానికి హాని కలిగించే స్టెరాయిడ్లు వాడి పెంచిన కోళ్ల విక్రయాలను పూర్తిగా నియంత్రించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. గుర్తింపు పొందిన, లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే హోటళ్లు, రెస్టారెంట్లు మాంసం కొనుగోలు చేసేలా ప్రోత్సహించనున్నారు. అదే సమయంలో, చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను అక్రమంగా సేకరించి చేపల మేతగా వాడుతున్న మాఫియా కార్యకలాపాలను కూడా ఈ విధానం ద్వారా అరికట్టవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని చికెన్ దుకాణాలు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాంసాభివృద్ధి సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 
Andhra Pradesh Government
AP chicken business
chicken shops licensing
poultry farm monitoring
steroid chicken control
meat development corporation
chicken waste mafia
poultry supply system
hygienic meat supply
restaurant meat purchase

More Telugu News