AP DSC: జనవరిలో మరో డీఎస్సీ... ఈసారి పక్కా ప్రణాళికతో విద్యాశాఖ

Nara Lokesh Announces DSC Notification in January
  • జనవరిలో మరో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వ సన్నాహాలు
  • డీఎస్సీకి ముందుగా టెట్ నిర్వహణకు ఏర్పాట్లు
  • ఈసారి టెట్ అర్హతల్లో పూర్తిగా ఎన్‌సీటీఈ నిబంధనల అమలు
  • న్యాయపరమైన చిక్కులు రాకుండా విద్యాశాఖ పక్కా ప్లాన్
  • మంత్రి లోకేశ్ ఇప్పటికే చేసిన ప్రకటనకు అనుగుణంగా చర్యలు
  • దాదాపు 2000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశం
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిసారీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు అడ్డంకిగా మారుతున్న న్యాయ వివాదాలకు ఈసారి ఫుల్‌స్టాప్ పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా, త్వరలో నిర్వహించబోయే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిబంధనల్లో భారీ మార్పులు చేయనుంది. ఇకపై టెట్ అర్హతలను పూర్తిగా జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

గతంలో డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలైన ప్రతిసారీ అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు వంటి అంశాలపై కోర్టు కేసులు దాఖలవుతూ నియామక ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు, ఈసారి టెట్ నోటిఫికేషన్ నుంచే ఎన్‌సీటీఈ నిబంధనలను కచ్చితంగా పాటించనున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా నియామక ప్రక్రియ సజావుగా సాగుతుందని విద్యాశాఖ భావిస్తోంది.

జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ప్రకటించినట్లుగా, జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌లో సుమారు 2000 పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఇందులో స్పెషల్ డీఎస్సీ కింద 1000 పోస్టులు, మెగా డీఎస్సీ-2025లో మిగిలిపోయిన 406 పోస్టులతో పాటు, ఈ ఏడాది పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల ఖాళీలను కూడా కలపనున్నారు. పోస్టుల భర్తీలో విద్యార్థుల సంఖ్యను కూడా ప్రామాణికంగా తీసుకోనున్నారు.
AP DSC
Nara Lokesh
DSC Notification
Teacher Recruitment
TET Exam
AP DSC 2025
School Education Department
NCTE Guidelines
Government Jobs Andhra Pradesh
Teacher Eligibility Test
Andhra Pradesh Education

More Telugu News