Harish Kumar Gupta: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే జైలే: డీజీపీ హరీశ్ గుప్తా

DGP Harish Kumar Gupta warns strict action on hate speech in social media
  • సోషల్ మీడియాలో విద్వేష వ్యాఖ్యలపై డీజీపీ హెచ్చరిక
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై సైబర్ నిఘా
  • ఏఐ ఫేక్ వీడియోలు సృష్టిస్తే మూల్యం తప్పదని వార్నింగ్
  • అనుచిత పోస్టులను షేర్ చేసినా చట్టపరమైన చర్యలు
  • ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎవరినీ వదిలిపెట్టేది లేదన్న డీజీపీ
సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెట్టినా, ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కంటెంట్‌పై రాష్ట్రంలోని అన్ని సైబర్ విభాగాలు సమన్వయంతో ప్రత్యేక నిఘా పెట్టాయని వెల్లడించారు.

ప్రముఖులైనా, సామాన్యులైనా ఎవరి గౌరవానికి భంగం కలిగించినా ఉపేక్షించేది లేదని డీజీపీ తేల్చి చెప్పారు. ఫొటోలు, వీడియోలు లేదా కనీసం వ్యాఖ్యల రూపంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే చట్టపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ పౌరులు సహా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ వేదికలను జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, సృజనాత్మక చర్చలకు వాడుకోవాలని కోరారు.

ఇటీవల పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ దుర్వినియోగంపై కూడా డీజీపీ తీవ్రంగా స్పందించారు. ఏఐ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి అశాంతికి కారణమయ్యే వారిని పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోరని, వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఉద్రిక్తతలు సృష్టించే పోస్టులను ఇతరులతో పంచుకున్నా (షేర్ చేసినా) చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
Harish Kumar Gupta
DGP Harish Gupta
social media
cyber crime
hate speech
fake news
artificial intelligence
AI
cyber security
Andhra Pradesh police

More Telugu News