Rahul Gandhi: రాహుల్ గాంధీ జూబ్లీహిల్స్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు: హరీశ్ రావు

Harish Rao Slams Rahul Gandhi on Jubilee Hills Issue
  • బీహార్‌లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతున్నారని విమర్శ
  • మాగంటి సునీతను అవమానించేలా మంత్రులు మాట్లాడారని ఆగ్రహం
  • తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పాలని నిలదీత
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్లు చోరీ జరిగిందని ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ, తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఓట్లు చోరీపై ఎందుకు మాట్లాడట లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, మాగంటి సునీతను గెలిపించాలని, ఒక ఆడబిడ్డను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారని, ఆడబిడ్డలను అవమానించే విధంగా మంత్రులు మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. విజ్ఞత మరిచి విచక్షణ లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పాలని హరీశ్ రావు నిలదీశారు. రాహుల్ గాంధీ వచ్చి మొహబ్బత్ కీ దుకాణ్ అంటారని, కానీ హైడ్రా ఏమో హైదరాబాద్ నగరంలో పేదల ఇళ్లను కూల్చివేస్తుందని, ఇదేనా ఆయన చెప్పే మొహబ్బత్ కీ దుకాణ్ అని విమర్శించారు. పండుగ రోజు కూడా పేద ప్రజల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. సునీతను ఓడించాలని 20 వేల దొంగ ఓట్లు కూడగట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, అప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ రావడం కూడా కష్టమేనని హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో నీటి దోపిడీ చేసే బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు.
Rahul Gandhi
Harish Rao
Jubilee Hills
Telangana Elections
BRS
Maganti Sunitha
Revanth Reddy
Hyderabad
Vote rigging

More Telugu News