Jogi Ramesh: లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధం.. నా ఫోన్ మీరే చెక్ చేసుకోండి: సీఎంకు జోగి రమేశ్ సవాల్

Jogi Ramesh Ready for Lie Detector Test on Liquor Case Allegations
  • నకిలీ మద్యం కేసు నిందితుడితో వాట్సాప్ చాట్‌పై జోగి రమేశ్ స్పందన
  • ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్
  • తన ఫోన్‌ను సీఎం, లోకేశ్‌కే ఇస్తానన్న మాజీ మంత్రి
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావుతో తనకు సంబంధాలున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేశ్ తీవ్రంగా స్పందించారు. ఆ ఆరోపణలను నిరూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లకు ఆయన సవాల్ విసిరారు. నిందితుడితో తాను వాట్సాప్‌లో చాటింగ్ చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడైన జనార్ధన్ రావు విచారణలో భాగంగా, జోగి రమేశ్‌తో వాట్సాప్‌లో చాట్ చేసినట్లు చెప్పాడని వార్తలు రావడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జోగి రమేశ్, ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన ఫోన్‌ను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌లకే ఇస్తానని, వారే స్వయంగా తనిఖీ చేసుకోవచ్చని అన్నారు.

అంతటితో ఆగకుండా, తాను లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మపై ప్రమాణం చేసేందుకు కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు తనతో పాటు ప్రమాణానికి వస్తారా? అని ఆయన నిలదీశారు. తనపై ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. "పైన దేవుడు ఉన్నాడు.. ఆయన అంతా చూస్తాడు" అని జోగి రమేశ్ పేర్కొన్నారు. 
Jogi Ramesh
Chandrababu Naidu
Nara Lokesh
Fake Liquor Case
Janardhan Rao
Lie Detector Test
Andhra Pradesh Politics
WhatsApp Chat
Tadepalli
Tirumala Venkateswara Temple

More Telugu News