Droupadi Murmu: ఏపీ హైకోర్టుకు వస్తున్న ముగ్గురు న్యాయమూర్తులు

Droupadi Murmu Approves AP High Court Justices
  • ఇద్దరు న్యాయమూర్తులు మానవేంద్రనాథ్ రాయ్, రమేశ్ ఏపీకి చెందిన వారే 
  • పశ్చిమ బెంగాల్ కు చెందిన జస్టిస్ సుభేందు సామంత తొలిసారిగా ఏపీకి
  • సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దొనాడి రమేశ్, జస్టిస్ సుభేందు సామంత ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నిన్న అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరనుంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్. గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 25న సమావేశమై ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. ఆ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది.

జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్

గుజరాత్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం వాసి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1964 మే 21న నరహరిరావు, విజయలక్ష్మీ దంపతులకు జన్మించారు. విశాఖలోని సెయింట్ అలోసియస్ పాఠశాలలో చదివిన ఆయన, ఎంవీపీ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రం పూర్తిచేశారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో రిజిస్ట్రార్ జనరల్‌గా (ఆర్జీ) పనిచేసిన ఆయన, హైకోర్టు విభజన సమయంలో కీలక పాత్ర పోషించారు. 2019లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన, గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లి 2023 నవంబర్ 2న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు తిరిగి మాతృ హైకోర్టుకు చేరుతున్నారు.

జస్టిస్ దొనాడి రమేశ్

అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్ రమేశ్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని కమ్మపల్లి. ఆయన 1965 జూన్ 27న జన్మించారు. తిరుపతిలో విద్యాభ్యాసం చేసి, నెల్లూరు వీఆర్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందారు. 1990లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి, ప్రభుత్వ న్యాయవాది, సర్వశిక్షా అభియాన్ స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు. 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి, తరువాత అలహాబాద్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు.

జస్టిస్ సుభేందు సామంత

కోల్ కతా హైకోర్టు నుంచి బదిలీ అయిన జస్టిస్ సుభేందు సామంత పశ్చిమ బెంగాల్ కు చెందినవారు. 1971 నవంబర్ 25న జన్మించిన ఆయన, కోల్ కతా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. తమ్లుక్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించి, తరువాత న్యాయాధికారిగా పలు జిల్లాల్లో సేవలందించారు. కోల్ కతా సిటీ సెషన్స్ కోర్ట్ చీఫ్ జడ్జిగా కూడా పనిచేశారు. 2022 మే 18న కోల్ కతా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2024 ఏప్రిల్ 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 
Droupadi Murmu
AP High Court
Justices Transfer
Cheekati Manavendranath Roy
Donadi Ramesh
Subhendu Samanta
Andhra Pradesh High Court
Supreme Court Collegium
High Court Judges
AP High Court Judges

More Telugu News