ఐరాస మానవ హక్కుల మండలికి ఏడోసారి ఎన్నికైన భారత్... ఏకగ్రీవంగా విజయం!

  • ఏకగ్రీవంగా సభ్యత్వాన్ని కైవసం చేసుకున్న ఇండియా
  • 2026–28 కాలానికి కొనసాగనున్న సభ్యత్వం
  • భారత నిబద్ధతకు ఇది నిదర్శనమన్న శాశ్వత ప్రతినిధి
అంతర్జాతీయ వేదికపై భారత్‌ మరో కీలక దౌత్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UN Human Rights Council) సభ్య దేశంగా ఏడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2026–28 కాలానికి గాను ఈ పదవిలో భారత్ కొనసాగనుంది. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది.

ఈ చారిత్రక విజయంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీశ్ పి. హర్షం వ్యక్తం చేశారు. "మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పరిరక్షణలో భారత్‌కు ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ ఎన్నిక ఒక ప్రతీక" అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా మద్దతు పలకడం ద్వారా భారత్‌పై ఉంచిన నమ్మకాన్ని ఇది తెలియజేస్తోందని అన్నారు.

ఈ ఎన్నికల్లో మద్దతు తెలిపిన అన్ని సభ్య దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ పదవీ కాలంలో మానవ హక్కుల పరిరక్షణ లక్ష్యాన్ని మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ప్రోత్సాహం, పరిరక్షణతో పాటు, వాటి ఉల్లంఘనలపై సమీక్ష జరపడంలో మానవ హక్కుల మండలి అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విజయంతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ తన నాయకత్వ పటిమను మరోసారి చాటుకుంది. 


More Telugu News