ఏపీలో గూగుల్ భారీ ప్రాజెక్ట్ పై బీబీసీ ప్రత్యేక కథనం

  • ఏపీలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ భారీ పెట్టుబడి
  • విశాఖలో ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్లు
  • అమెరికా వెలుపల ఇదే అతిపెద్ద ఏఐ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక అధ్యాయం మొదలుకానుంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, రాష్ట్రంలోని కీలక నగరమైన విశాఖపట్నంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం ఏకంగా 15 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు అధికారికంగా ఒప్పందాలు కూడా జరిగాయి. ఈ భారీ ప్రాజెక్ట్ పై బీబీపీ కథనాన్ని వెలువరించింది.

బీబీసీ కథనం ప్రకారం:
ఈ విషయాన్ని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఈరోజు ఢిల్లీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో అధికారికంగా వెల్లడించారు. "అమెరికా వెలుపల ప్రపంచంలో మరెక్కడా లేనంతగా మేం పెట్టుబడి పెట్టబోతున్న అతిపెద్ద ఏఐ హబ్ ఇదే" అని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో ఈ పెట్టుబడిని దశలవారీగా పెట్టనున్నట్లు తెలిపారు. 12 దేశాలలో విస్తరించి ఉన్న గూగుల్ గ్లోబల్ ఏఐ సెంటర్ల నెట్‌వర్క్‌లో విశాఖ కేంద్రం కూడా భాగం కానుంది.

ఈ భారీ పెట్టుబడిపై రాష్ట్ర టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. "ఇది మన రాష్ట్ర డిజిటల్ భవిష్యత్తు, ఆవిష్కరణలు, ప్రపంచ స్థాయి గుర్తింపులో ఒక భారీ ముందడుగు" అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం రాయితీలపై భూమి, విద్యుత్ వంటి ప్రోత్సాహకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. 2029 నాటికి రాష్ట్రంలో 6 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో ఈ ప్రాజెక్టు ఒక కీలక మైలురాయి కానుంది.

భారత్‌లో వేగంగా పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగదారులు, తక్కువ డేటా ధరల కారణంగా అనేక అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఇక్కడ తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. "ఈ కేంద్రం ద్వారా భారత్‌లోని పరిశ్రమలకు, వినియోగదారులకు మా అత్యాధునిక టెక్నాలజీని అందిస్తాం. తద్వారా దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం" అని ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా క్లౌడ్, ఏఐ మౌలిక సదుపాయాలతో పాటు పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, విస్తరించిన ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్‌ను కూడా అనుసంధానం చేయనున్నారు. 


More Telugu News