Infosys: బ్రిటన్ లో మెగా కాంట్రాక్టు దక్కించుకున్న ఇన్ఫోసిస్

Infosys Wins Mega Contract in UK
  • యూకే ప్రభుత్వ ఆరోగ్య సంస్థ నుంచి ఇన్ఫోసిస్‌కు భారీ కాంట్రాక్టు
  • 1.2 బిలియన్ పౌండ్ల (సుమారు రూ. 12 వేల కోట్లు) విలువైన ఒప్పందం
  • 15 ఏళ్ల పాటు కొనసాగనున్న ప్రాజెక్టు
  • 19 లక్షల మంది ఎన్ హెచ్ ఎస్ ఉద్యోగుల పేరోల్, డేటా నిర్వహణ
  • పాత టెక్నాలజీ స్థానంలో అత్యాధునిక ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్
  • ఇన్ఫోసిస్ ఏఐ టెక్నాలజీ ‘టోపాజ్’ వినియోగం
భారత ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ అంతర్జాతీయంగా మరో భారీ విజయాన్ని అందుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ ఎస్) నుంచి ఏకంగా 1.2 బిలియన్ పౌండ్ల (సుమారు రూ. 12 వేల కోట్లకు పైగా) విలువైన మెగా కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ ఒప్పందం 15 సంవత్సరాల పాటు కొనసాగనుందని ఇన్ఫోసిస్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ కాంట్రాక్టులో భాగంగా ఇన్ఫోసిస్.. ఇంగ్లండ్, వేల్స్‌లోని ఎన్ హెచ్ ఎస్ ఉద్యోగుల కోసం ‘ఫ్యూచర్ ఎన్ హెచ్ ఎస్ వర్క్‌ఫోర్స్ సొల్యూషన్’ పేరుతో ఒక అత్యాధునిక, డేటా ఆధారిత మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న పాత ఎలక్ట్రానిక్ స్టాఫ్ రికార్డ్ (ఈఎస్ఆర్) సిస్టమ్ స్థానంలో ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఎన్ హెచ్ ఎస్‌లో పనిచేస్తున్న సుమారు 19 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన నియామకాలు, జీతభత్యాలు, కెరీర్ అభివృద్ధి, పదవీ విరమణ వంటి అన్ని అంశాలను ఇన్ఫోసిస్ నిర్వహించనుంది. ఏటా 55 బిలియన్ పౌండ్ల విలువైన పేరోల్ చెల్లింపుల బాధ్యతను ఈ కొత్త ప్లాట్‌ఫామ్ చూసుకుంటుంది.

ఈ ఒప్పందంపై ఎన్ హెచ్ ఎస్ బిజినెస్ సర్వీసెస్ అథారిటీ (ఎన్ హెచ్ ఎస్ బీఎస్ఏ) సీఈఓ మైఖేల్ బ్రాడీ స్పందిస్తూ, "ఇది కేవలం పాత సిస్టమ్‌ను మార్చడం మాత్రమే కాదు. ఆరోగ్య రంగంలో పదేళ్ల ప్రణాళికను విజయవంతం చేసేందుకు, భవిష్యత్ అవసరాలకు తగ్గ సిబ్బందిని తయారు చేయడంలో ఈ ప్రాజెక్టు ఒక కీలక ముందడుగు" అని వివరించారు. ఇన్ఫోసిస్‌తో కలిసి పనిచేయడం ద్వారా తమ ఉద్యోగులను ఆకర్షించడానికి, వారిని ప్రోత్సహించడానికి ఒక ఆధునిక పరిష్కారాన్ని రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇన్ఫోసిస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సలిల్ పరేఖ్ మాట్లాడుతూ.. "యూకేలో లక్షలాది మంది జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్ హెచ్ ఎస్ కోసం పనిచేసే అవకాశం దక్కడం మాకు గర్వకారణం. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మాకున్న అపార అనుభవాన్ని, మా ఏఐ ప్లాట్‌ఫామ్ ‘ఇన్ఫోసిస్ టోపాజ్’ను ఉపయోగించి కేవలం సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, భవిష్యత్తులో ఎన్ హెచ్ ఎస్ సేవలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఒక శక్తివంతమైన వేదికను నిర్మిస్తాం" అని అన్నారు. కఠినమైన ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ తర్వాత, భారీ డిజిటల్ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన ట్రాక్ రికార్డు ఆధారంగా ఇన్ఫోసిస్‌ను ఎంపిక చేసినట్టు ఎన్ హెచ్ ఎస్ అధికారులు తెలిపారు.
Infosys
Infosys mega contract
UK National Health Service
NHS contract
Salil Parekh
Infosys Topaz
Future NHS Workforce Solution
NHS Business Services Authority
Michael Brady
digital transformation

More Telugu News