Harshit Rana: హర్షిత్ రాణా ఎంపికపై మాజీ క్రికెటర్ విమర్శలు.. తీవ్రంగా స్పందించిన గంభీర్

Gautam Gambhir Slams Srikkanth Over Harshit Rana Selection Criticism
  • గంభీర్ కోసం ఎప్పుడూ తల ఊపే హర్షిత్ రాణాను ఎంపిక చేశారన్న క్రిస్ శ్రీకాంత్
  • ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్న గౌతమ్ గంభీర్
  • మెరిట్ ఆధారంగానే హర్షిత్ రాణాను ఎంపిక చేశామని స్పష్టీకరణ 
మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌పై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వన్డే జట్టుకు బౌలర్ హర్షిత్ రాణాను ఎంపిక చేయడంపై క్రిస్ శ్రీకాంత్ చేసిన విమర్శలను గంభీర్ ఖండించాడు.

తన యూట్యూబ్ ఛానల్‌లో శ్రీకాంత్.... గంభీర్ కోసం ఎప్పుడూ తల ఊపే హర్షిత్ రాణాను ఈ పర్యటనకు ఎంపిక చేశారని పేర్కొన్నాడు. శ్రీకాంత్ వ్యాఖ్యలపై గంభీర్ తీవ్రంగా స్పందించాడు.

ఈ వ్యాఖ్యలను గంభీర్ తప్పుబడుతూ, ఇది సిగ్గుచేటని, సొంత యూట్యూబ్ ఛానల్ కోసం 23 ఏళ్ల క్రికెటర్‌ను విమర్శించడం సరికాదని మండిపడ్డాడు. ఇది అన్యాయమని అన్నాడు. హర్షిత్ రాణాను మెరిట్ ఆధారంగానే జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు స్పష్టం చేశాడు.

హర్షిత్ రాణా తండ్రి సెలక్షన్ కమిటీలో లేరని, ఆయన మాజీ క్రికెటర్ కాదని, ఎన్ఆర్ఐ కూడా కాదని గంభీర్ తెలిపాడు. హర్షిత్ తన సామర్థ్యంతో క్రికెట్ ఆడుతున్నాడని, అలాగే కొనసాగుతాడని భరోసా ఇచ్చాడు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరికాదని గంభీర్ సూచించాడు.

హర్షిత్ రాణా పది మ్యాచ్‌లలో 19 వికెట్లు తీశాడని గంభీర్ గుర్తు చేశాడు. ఆ నైపుణ్యం కూడా సరిపోదని అనుకుంటే సెలక్షన్ కమిటీ అతడిని తప్పిస్తుందని అన్నాడు. సామర్థ్యం ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడానికి సెలక్టర్లు ఉన్నారని పేర్కొన్నాడు. 23 ఏళ్ల క్రికెటర్ గురించి ఏది పడితే అది మాట్లాడితే అతని మనస్సుపై ప్రభావం పడుతుందనే విషయాన్ని గుర్తించాలని గంభీర్ హితవు పలికాడు.
Harshit Rana
Gautam Gambhir
Kris Srikkanth
Indian Cricket Team
Australia Tour

More Telugu News