Maganti Sunitha: వేదిక మీద ఏడవమని మాగంటి సునీతకు చెప్పారు.. అది ఆర్టిఫిషియల్ ఏడుపు: పొన్నం ప్రభాకర్

Maganti Sunitha Told to Cry on Stage Claims Ponnam Prabhakar
  • కేటీఆర్ ఒత్తిడి మేరకు సునీత వేదిక మీద ఏడ్చారన్న పొన్నం ప్రభాకర్
  • అందరి ముందు ఏడవమని చెప్పే కేసీఆర్ రాజకీయం చాలా దుర్మార్గమన్న మంత్రి
  • ఆడకూతురు కన్నీళ్లను కూడా బీఆర్ఎస్ వదలడం లేదన్న తుమ్మల నాగేశ్వర రావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న రహమత్ నగర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో వేదికపై మాట్లాడిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన భర్తను గుర్తు చేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె కంటతడి పెట్టారు. ఆమె వేదికపై కన్నీరు కార్చడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

మాగంటి సునీతను ఏడవమని ఆ పార్టీ అగ్ర నాయకులే చెప్పి ఉంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ అనుమానం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన బూత్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ ఒత్తిడి మేరకు మాగంటి సునీత వేదికపై ఏడ్చారని, ఇది తనకు చాలా ఆశ్చర్యం వేసిందని అన్నారు. అందరి ముందు మైక్ పట్టుకుని ఏడవమని చెప్పే రాజకీయం చాలా దుర్మార్గమైనదని అన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఆడకూతురు కన్నీళ్లను కూడా బీఆర్ఎస్ వదిలిపెట్టేలా లేదని ఆయన అన్నారు. అలాంటి మార్గంలో అధికారంలోకి రావాలని, ఈ రాష్ట్రాన్ని గతంలో వలె దోచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

అంతకుముందు, పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, మాగంటి సునీత ఏడిచే విధానం చూస్తుంటే, పార్టీ నాయకుల సూచనతోనే కృత్రిమ ఏడుపుగా కనిపిస్తోందని అన్నారు. ఆమె పట్ల తమకు సానుభూతి ఉన్నప్పటికీ, రాజకీయాలు వేరు అన్నారు. వేదికలపై, రాజకీయ ప్రసంగాల మధ్య సానుభూతి ఓట్ల కోసం కన్నీళ్లు పెట్టాలనుకోవడం సరికాదని అన్నారు. ఈ డ్రామా అంతా సినిమాల్లో చూసినట్లుగా ఉందని ఆయన అన్నారు.
Maganti Sunitha
Ponnam Prabhakar
Jubilee Hills byelection
BRS
Congress
Telangana politics

More Telugu News