మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. అగ్రనేత వేణుగోపాల్ లొంగుబాటు
- పోలీసులకు లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాల్ రావు
- ఆయనతో పాటు మరో 60 మంది కూడా లొంగుబాటు
- మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసుల ఎదుట హాజరు
- పార్టీ విధానాలతో విభేదాల వల్లే ఈ నిర్ణయమని సమాచారం
- దివంగత నేత కిషన్‌జీకి వేణుగోపాల్ స్వయానా సోదరుడు
గత కొంతకాలంగా పార్టీ అనుసరిస్తున్న విధానాలతో వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. విప్లవోద్యమాన్ని విజయవంతం చేయాలంటే ప్రజల్లోకి బహిరంగంగా వెళ్లడమే సరైన మార్గమని ఆయన భావించినట్లు సమాచారం. ఇదే విషయంపై పార్టీకి ఆయన రాసిన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. కొన్ని రోజుల క్రితం, దివంగత మావోయిస్టు నేత, తన సోదరుడైన మల్లోజుల కోటేశ్వరరావు (కిషన్‌జీ) పేరుతో రాసిన మరో లేఖలో కూడా ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే తాను పార్టీ నుంచి శాశ్వతంగా వైదొలగుతున్నట్లు వేణుగోపాల్ ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీలో ఇకపై కొనసాగలేనని స్పష్టం చేస్తూ ఆయన మావోయిస్టు పార్టీని వీడారు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే, తన అనుచరులతో కలిసి గడ్చిరోలి పోలీసుల ఎదుట ఆయన లొంగిపోవడం గమనార్హం. ఆయన లొంగుబాటుకు దారితీసిన కచ్చితమైన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.