Rani Mukerji: సినీ ఫీల్డ్‌లోకి వచ్చేందుకు చాలా పోరాటాలు చేయాల్సి వచ్చింది.. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ

Rani Mukerji Faced Struggles Entering Film Industry
  • మొదట్లో తన తండ్రి రామ్ ముఖర్జీ కూడా సమర్ధించలేదన్న రాణి ముఖర్జీ 
  • తన తల్లి నిర్మాతను కలిసి సినిమా నుంచి తొలగించాలని కోరిందన్న రాణి
  • సినీ రంగంలో నిత్య విద్యార్థిగానే ఉంటానని వెల్లడి  
బాలీవుడ్ సినీ రంగంలోకి అడుగుపెట్టడానికి తాను ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చిందని సీనియర్ నటి రాణి ముఖర్జీ అన్నారు. మూడు దశాబ్దాలుగా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె, ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో రాణి ముఖర్జీ సినీరంగంలో తన తొలి రోజులు, ఎదుర్కొన్న సవాళ్లు, నటిగా తన దృక్కోణం గురించి పంచుకున్నారు.

తాను సినీరంగంలోకి అడుగు పెట్టేందుకు మొదట్లో తన తండ్రి రామ్ ముఖర్జీ కూడా సమర్ధించలేదని ఆమె అన్నారు. ఆ రోజుల్లో సినిమా కుటుంబాల పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు నటనను వృత్తిగా ఎంచుకోవడం అరుదైన విషయంగా ఉండేదన్నారు. తాను పాఠశాలలో సినిమా కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకోలేదని తెలిపారు. ఒక దశలో తన తల్లి కూడా నిర్మాతను కలిసి సినిమా నుంచి తనను తొలగించమని కోరిందన్నారు. స్క్రీన్ టెస్ట్‌లో మంచి ఫలితం రావడంతోనే నటించడానికి ఒప్పుకున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, యువతలో చాలా మంది నటులుగా మారాలనే ఆకాంక్షతో ముందుకు వస్తున్నారని అన్నారు.

“అవార్డు విలువ దాన్ని అంగీకరించే ప్రేక్షకుల్లోనే ఉంది”

జాతీయ అవార్డు ప్రకటించినప్పుడు ప్రజలు కూడా మనం దానికి అర్హులమని అనుకుంటే వచ్చే ఆనందం చెప్పలేనిదని ఆమె అన్నారు. ఇటీవల తనకు జాతీయ పురస్కారం వచ్చినప్పుడు అందరూ అంగీకరించారని, ఆ అంగీకారం తనకు అవార్డు కంటే గొప్పదని అన్నారు. చిన్న అవార్డు అయినా కళాకారులకు చాలా ముఖ్యమని, అది కష్టానికి దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు.

‘హిచ్కీ’ సినిమా షూటింగ్ రోజులు

తన తల్లి బాధ్యతలతో పాటు నటిగా పనిచేయడం ఎలా సాగిందన్న విషయంపై ఆమె మాట్లాడుతూ.."‘హిచ్కీ’ సినిమా చేస్తున్నప్పుడు నా కుమార్తె ఆదిరాకి 14 నెలలు మాత్రమే. నేను ఉదయం ఆరున్నర గంటలకు పాలు పట్టి షూటింగ్‌కి వెళ్లేదాన్ని. పన్నెండు గంటలకల్లా నా పార్ట్ పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చి బిడ్డను చూసుకునేదాన్ని. మా దర్శకుడు, యూనిట్‌ అందరూ అర్థం చేసుకుని సహకరించారు. సినిమా చేయాలా వద్దా అన్నది ఎల్లప్పుడూ నటుడు, నిర్మాతల పరస్పర అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. ఎవరూ బలవంతం చేయలేరు" అని ఆమె వివరించారు.

“ప్రతి సినిమాతో నేర్చుకుంటూనే ఉంటా”

తన కెరీర్‌ పట్ల ఉన్న నిబద్ధతను రాణి ముఖర్జీ వివరిస్తూ.. ఎన్ని దశాబ్దాలు గడిచినా తాను సినీ రంగంలో నిత్య విద్యార్థిగానే ఉంటానని, ప్రతి సినిమాలో కొత్తగా ఏదో నేర్చుకుంటానని తెలిపారు. సెట్లో లేని సమయంలో కూడా తాను బయట ప్రపంచాన్ని గమనిస్తూనే ఉంటానని అన్నారు. ప్రతి ప్రదేశం మనకు కొత్త అనుభవం నేర్పుతుందని చెప్పారు. తాను బాగా చేయలేదని విమర్శలు వినడం బాధ కలిగిస్తుందని, అందుకే ప్రతీ పాత్రలోనూ నూతనత్వం ఉండేలా ప్రయత్నిస్తానని రాణి ముఖర్జీ చెప్పుకొచ్చారు. 
Rani Mukerji
Rani Mukerji interview
Bollywood actress
Hichki movie
National Award
Ram Mukerji
Bollywood career struggles
Indian cinema
actress struggles
movie shooting

More Telugu News