Salman Khan: తనను విమర్శించిన ఇద్దరు స్టార్ డైరక్టర్లకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన సల్మాన్ ఖాన్

Salman Khan Reacts to Murugadoss Kashyap Comments
  • 'సికిందర్' ఫ్లాప్‌పై దర్శకుడు మురుగదాస్‌కు సెటైర్
  • పనిపై దృష్టి పెట్టమని 'దబాంగ్' డైరెక్టర్‌కు సూటిగా సలహా
  • గాయాల వల్లే షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చేవాడినన్న సల్మాన్
తనపై ఇద్దరు ప్రముఖ దర్శకులు చేసిన తీవ్ర ఆరోపణలపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు మౌనం వీడారు. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్ 19' కార్యక్రమం వేదికగా వారికి తనదైన శైలిలో గట్టిగా బదులిచ్చారు. తనను విమర్శించడం మాని, పని మీద దృష్టి పెట్టాలంటూ వారికి చురకలంటించారు.

'సికిందర్' సినిమా ఫ్లాప్ అవ్వడానికి తానే కారణమని దర్శకుడు ఏ.ఆర్. మురుగుదాస్ చేసిన విమర్శలపై సల్మాన్ స్పందిస్తూ, "సినిమా కథ బాగుంది. కానీ నేను రాత్రి 9 గంటలకు సెట్స్‌కు రావడం వల్లే ఫ్లాప్ అయిందని దర్శకుడు అంటున్నారు. నాకు అయిన గాయాల కారణంగా ఆలస్యంగా రావాల్సి వచ్చేదని ఆయనకు తెలియదు. అదే ఆయన తీసిన మరో సినిమాలో హీరో ఉదయం 6 గంటలకే షూటింగ్‌కు వెళ్లాడు కదా, మరి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు" అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు.

అనంతరం 'దబాంగ్' దర్శకుడు అభినవ్ కశ్యప్ ఆరోపణలపైనా సల్మాన్ పరోక్షంగా స్పందించారు. "ఆ దర్శకుడు నాతో పాటు ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లను ప్రతీ విషయంలోకి లాగుతుంటాడు. మాపై విమర్శలు చేసే సమయాన్ని మీ పనిపై పెట్టండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి" అని సలహా ఇచ్చారు.

గతంలో దర్శకుడు మురుగదాస్ మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్ షూటింగ్‌కు రాత్రి 8 గంటలకు వచ్చి, 11 గంటలకు మొదలుపెట్టేవారని, దీనివల్ల కొన్ని కీలకమైన భావోద్వేగ సన్నివేశాలు సరిగా రాలేదని ఆరోపించారు. మరోవైపు, 'దబాంగ్' సీక్వెల్ చేయడానికి నిరాకరించినందుకు సల్మాన్, ఆయన కుటుంబం తన కెరీర్‌ను నాశనం చేశారని, సల్మాన్ ఒక 'గుండా' అని, అతనికి నటనపై ఆసక్తి లేదని అభినవ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వరుస ఆరోపణల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. 
Salman Khan
Bollywood
Bigg Boss 19
AR Murugadoss
Abhinav Kashyap
Dabangg
Bollywood directors
movie criticism
Sikandar movie
film industry

More Telugu News