Vanitha Anitha: రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ఏపీ హోంమంత్రి అనిత సమీక్ష .. కీలక సూచనలు

Vanitha Anitha Reviews Road Safety Measures in AP
  • పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలన్న హోంమంత్రి అనిత
  • ఈ ఏడాది 3.5 శాతం రోడ్డు ప్రమాదాలు పెరిగాయని వెల్లడి
  • బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశం
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు పోలీసు శాఖ మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని ఏపీ హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో నిన్న రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ట్రాఫిక్ చలానా సిస్టమ్, సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. “గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 3.5 శాతం పెరిగాయి. ఇందుకు కారణాలు విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలి. బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రియల్ టైమ్ ట్రాఫిక్ మానిటరింగ్ కోసం ఆర్టీజీఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి” అని ఆమె సూచించారు.

విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అమలు చేస్తున్న “అస్త్రం” విధానాన్ని ఇతర నగరాల్లోనూ అమలు చేయాలని హోంమంత్రి ఆదేశించారు. ఈ విధానం ద్వారా ప్రమాదాలకు కారణమయ్యే వాహనదారులపై సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు.

సమీక్షలో రోడ్ సేఫ్టీ ఏడీజీ కృపానంద త్రిపాఠి, డీఐజీ విజయరావు, మల్లికా గార్గ్, టెక్నికల్ సర్వీసెస్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. 
Vanitha Anitha
AP Home Minister
Road Safety
Traffic Control
Andhra Pradesh Police
RTGS
NTR District Police
Astram program
Artificial Intelligence
Vijayawada

More Telugu News