PM Kisan Yojana: పీఎం కిసాన్‌లో భారీ అక్రమాలు... రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

PM Kisan Scheme Faces Huge Irregularities States Get Orders
  • పీఎం కిసాన్ పథకంలో వెలుగుచూసిన భారీ అక్రమాలు
  • ఒకే ఇంట్లో భార్యాభర్తలిద్దరూ అక్రమంగా లబ్ధి
  • దాదాపు 18 లక్షల జంటలు అనర్హులని తేల్చిన కేంద్రం
  • తనిఖీలు పూర్తి చేయాలని రాష్ట్రాలకు ఈ నెల‌ 15 డెడ్‌లైన్
  • అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన చర్యలు
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకంలో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అర్హత లేని లక్షలాది మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ నిర్వహించిన తనిఖీల్లో తేలింది. ముఖ్యంగా ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ పెట్టుబడి సాయం అందుకుంటున్న 31.01 లక్షల అనుమానాస్పద కేసులను అధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం, అనర్హుల ఏరివేతకు రంగంలోకి దిగింది. గుర్తించిన అనుమానాస్పద కేసుల జాబితాను ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటివరకు 19.02 లక్షల మంది లబ్ధిదారులను పరిశీలించగా, వారిలో ఏకంగా 17.87 లక్షల మంది (93.98 శాతం) భార్యాభర్తలు ఇద్దరూ ప్రయోజనం పొందుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ తనిఖీల ప్రక్రియను బుధవారం (అక్టోబర్ 15) లోగా పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు గడువు విధించింది.

నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి
పీఎం-కిసాన్ మార్గదర్శకాల ప్రకారం, ఒక రైతు కుటుంబంలో భార్య లేదా భర్త.. ఎవరో ఒకరు మాత్రమే పెట్టుబడి సాయం పొందడానికి అర్హులు. కానీ ఈ నిబంధనను చాలామంది ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా, ఒకే కుటుంబంలోని మైనర్ పిల్లలు, ఇతర సభ్యులు లబ్ధి పొందుతున్న 1.76 లక్షల కేసులను కూడా కేంద్రం గుర్తించింది. వారసత్వంగా కాకుండా ఇతర మార్గాల్లో భూమిని పొందిన 8.11 లక్షల మంది అనర్హులు కూడా ఈ పథకం కింద డబ్బులు తీసుకుంటున్నారని వెల్లడైంది. భూమి అమ్మిన తర్వాత కూడా పాత యజమానులు, కొత్త యజమానులు ఇద్దరూ లబ్ధి పొందుతున్న 8.11 లక్షల కేసులు కూడా బయటపడ్డాయి.

అక్రమాలకు అడ్డుకట్ట
ఇలాంటి లోపాలను సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. భవిష్యత్తులో అక్రమాలకు తావులేకుండా ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి రైతు గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది. చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం కింద కేంద్రం ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు 20 విడతల్లో రూ.3.90 లక్షల కోట్లను పంపిణీ చేసింది. తదుపరి విడత నిధులను దీపావళిలోగా దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులకు విడుదల చేసే అవకాశం ఉంది.
PM Kisan Yojana
PM Kisan Samman Nidhi
PM Kisan Scam
Farmer welfare
Agriculture ministry
Farmer scheme
Central government schemes
Farmer identification card
Agriculture
Farmer support

More Telugu News