Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో సంచలనం... జోగి రమేశ్ చెబితేనే చేశానన్న జనార్దన్ రావు

Jogi Ramesh ordered me to make fake liquor says Janardhan Rao
  • మాజీ మంత్రి జోగి రమేశ్ చెప్పడంతోనే ఈ పని చేశానని వెల్లడి
  • టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపణ
  • జోగి రమేశే సొంత మనుషులతో లీక్ చేయించారని వెల్లడి
  • ఇచ్చి సాక్షి మీడియాతో రైడ్ చేయించారని వ్యాఖ్య
  • బెయిల్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని వీడియోలో ఆవేదన
నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టయిన నిందితుడు జనార్దన్ రావు... మాజీ మంత్రి జోగి రమేశ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది జోగి రమేశేనని, ఆయన ఆదేశాల మేరకే తాను నకిలీ మద్యం తయారు చేశానని ఒక వీడియో ద్వారా తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఈ కుట్ర పన్నారని ఆయన ఆరోపించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

జనార్దన్ రావు కథనం ప్రకారం, గత ప్రభుత్వ హయాంలోనే తాము నకిలీ మద్యం తయారు చేసినప్పటికీ, ప్రభుత్వం మారడంతో ఆపేశామని తెలిపారు. అయితే, టీడీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు జోగి రమేశ్ తమను మళ్లీ ప్రోత్సహించారని వెల్లడించారు. "ముందుగా ఇబ్రహీంపట్నంలో ప్లాన్ చేశాం. కానీ, చంద్రబాబుపై బురద జల్లాలంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె సరైన ప్రదేశమని జోగి రమేశ్ చెప్పారు. ఆర్థిక సాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు" అని జనార్ధన్ రావు వివరించారు. ఈ పథకంలో భాగంగా తనను ఆఫ్రికాలోని తన మిత్రుడి వద్దకు పంపించారని పేర్కొన్నారు.

అయితే, ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది కూడా జోగి రమేశేనని జనార్దన్ రావు ఆరోపించారు. "ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తన మనుషులతోనే జోగి రమేశ్ లీక్ ఇచ్చారు. రైడ్‌కు ముందురోజు ఇబ్రహీంపట్నంలో సరుకు పెట్టించి, ఆ తర్వాత సాక్షి మీడియాకు సమాచారం ఇచ్చి రైడ్ చేయించారు. అనుకున్నట్లే చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది" అని ఆయన అన్నారు.

జోగి రమేశ్ తనను మోసం చేశారని జనార్దన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. "ఆఫ్రికా నుంచి రావొద్దని, బెయిల్ తానే ఇప్పిస్తానని నమ్మబలికారు. కానీ చివరకు హ్యాండ్ ఇచ్చి, ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని నా సోదరుడిని కూడా ఇరికించారు. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నప్పటికీ నన్ను మోసం చేయడంతోనే బయటకు వచ్చి నిజాలు చెబుతున్నాను" అని జనార్దన్ రావు వీడియోలో పేర్కొన్నారు. ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దన్ రావు వెల్లడించిన వివరాలు ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారాయి. 
Jogi Ramesh
fake liquor case
Janardhan Rao
Andhra Pradesh politics
TDP
YSRCP
liquor scam
political conspiracy
Chittor district
Ibrahimpatnam

More Telugu News