ECI: నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల

Election Commission Announces By Election Schedule for Four States
  • రాజస్థాన్, పంజాబ్, ఒడిశా, జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు
  • నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు
  • ఎమ్మెల్యేల మృతి, అనర్హతతో ఖాళీ అయిన స్థానాలు
  • వివరాలతో నోటిఫికేషన్ విడుదల చేసిన భారత ఎన్నికల సంఘం
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ఈ మేరకు నోటిఫికేషన్లను విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి, జమ్మూకశ్మీర్‌లో రెండు స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని అంటా (193) నియోజకవర్గ ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనాపై 20 ఏళ్ల నాటి క్రిమినల్ కేసులో కోర్టు తీర్పు కారణంగా అనర్హత వేటు పడింది. ఈ ఏడాది మే 23న స్పీకర్ వాసుదేవ్ దేవనాని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇక్కడ అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఇక, ఒడిశాలోని నువాపడ (71) బీజేడీ ఎమ్మెల్యే రాజేంద్ర ధొలాకియా, పంజాబ్‌లోని తర్న్ తారన్ (21) ఆప్ ఎమ్మెల్యే కశ్మీర్ సింగ్ సోహల్ మరణించడంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాజేంద్ర ధొలాకియా సెప్టెంబర్ 8న చెన్నైలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 20, 21 తేదీల్లో మొదలవుతుంది.

వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లోని నాగ్రోటా (77), బుద్గాం (27) అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీఐ ప్రకటించింది. అన్ని నియోజకవర్గాల్లోనూ నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను అక్టోబర్ చివరి వారం నాటికి పూర్తి చేసి, నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈసీఐ ప్రకటనతో ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది.
ECI
Election Commission of India
Rajasthan by election
Punjab by election
Odisha by election
Jammu Kashmir by election
Assembly constituencies
By election schedule
Kanwar Lal Meena
Rajendra Dholakia
Kashmir Singh Sohal

More Telugu News