Medak Woman Assault: మెదక్‌లో అమానుషం.. పని ఇస్తామని నమ్మించి.. మహిళపై అత్యాచారం.. ప్రాణాలు కోల్పోయిన బాధితురాలు

Medak Woman Assault Victim Dies After Rape and Torture
  • పని ఇస్తామని నమ్మించి మహిళను కిడ్నాప్ చేసిన దుండగులు
  • నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం, చిత్రహింసలు
  • వివస్త్రను చేసి ఓ స్తంభానికి కట్టేసి పరారీ
  • శనివారం ఉదయం గుర్తించి ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మృతి
పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లిన ఓ నిరుపేద మహిళ కామాంధుల చేతిలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. పని ఇప్పిస్తామని నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన దుండగులు, ఆమెపై అత్యాచారానికి పాల్పడి, చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. మెదక్ జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం జానకంపల్లి పంచాయతీ పరిధిలోని ఓ తండాకు చెందిన మహిళ శుక్రవారం ఉదయం కూలి పని కోసం మెదక్‌కు వచ్చింది. అక్కడి కూలీల అడ్డాలో పని కోసం ఎదురుచూస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను సంప్రదించారు. పని ఉందని నమ్మబలికి, కొల్చారం మండలం అప్పాజీపల్లి శివారులోని ఏడుపాయల వెళ్లే మార్గంలో ఉన్న ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆమెను వివస్త్రను చేసి, రెండు చేతులను ఓ స్తంభానికి కట్టేసి అక్కడి నుంచి పరారయ్యారు.

రాత్రంతా నరకయాతన అనుభవించిన ఆమెను శనివారం ఉదయం అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు గమనించారు. అపస్మారక స్థితిలో స్తంభానికి కట్టేసి ఉన్న ఆమెను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇతర పోలీసులు ఆమెను వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. శనివారం రాత్రి అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Medak Woman Assault
Medak
Woman Assault
Rape and Murder
Telangana Crime
Crime News
Janakampalli
Appajipalli
Seven Ponds

More Telugu News