కాంతార చాప్టర్-1 వెనుక ఇంత జరిగిందా?... పుకార్లను కొట్టిపారేసిన రిషబ్ శెట్టి

  • 'కాంతార చాప్టర్ 1' షూటింగ్‌లో సమస్యలంటూ వచ్చిన వార్తలపై స్పందించిన రిషబ్
  • అవన్నీ కొందరు కావాలనే సృష్టించిన కథనాలని కొట్టివేత
  • అడవిలో నెట్‌వర్క్ లేనిచోట షూటింగ్ చేశామన్న హీరో
  • అందుకే మీడియాకు, జనానికి దూరంగా ఉన్నామని వెల్లడి
  • ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో పుకార్లు పుట్టాయన్న రిషబ్
  • సినిమాకు ఎలాంటి పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదని స్పష్టీకరణ
కాంతార: చాప్టర్ 1' సినిమా నిర్మాణం విషయంలో ఎన్నో సమస్యలు తలెత్తాయని, షూటింగ్ ఆలస్యమైందని వచ్చిన వార్తలను నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తీవ్రంగా ఖండించారు. అవన్నీ కొందరు కావాలనే సృష్టించిన కథనాలని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ పుకార్లపై స్పందిస్తూ, సినిమా నిర్మాణం సాఫీగా సాగిందని తెలిపారు.

ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ, "నిజానికి మాకు ఎలాంటి సమస్య రాలేదు. అదంతా కేవలం కొందరు కల్పించిన ప్రచారం మాత్రమే. మేము అడవిలో షూటింగ్ చేస్తున్నాం, అక్కడ నెట్‌వర్క్ కూడా సరిగా ఉండదు. అందుకే మీడియాకు, ప్రజలకు దూరంగా ఉండాల్సి వచ్చింది" అని వివరించారు. సాధారణంగా సినిమాలకు చేసినట్టు తాము ఎప్పటికప్పుడు పోస్టర్లు, ఇంటర్వ్యూలు, టీజర్లు విడుదల చేయలేదని, కేవలం ఒక టీజర్ తర్వాత నేరుగా పనిలో మునిగిపోయామని అన్నారు. "షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ఒక మేకింగ్ వీడియో విడుదల చేశాం. ఈ గ్యాప్‌లో కొందరు సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేశారు" అని రిషబ్ పేర్కొన్నారు.

కాగా, దాదాపు 200 రోజుల పాటు జరిగిన ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. కర్ణాటకలోని కొల్లూరు సమీపంలో ఉన్న సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు యం.ఎఫ్. కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళుతున్న బస్సు ప్రమాదానికి గురై ఆరుగురు గాయపడ్డారు. 

విజువల్స్, సాంస్కృతిక అంశాల పరంగా 'కాంతార: చాప్టర్ 1' చిత్రం విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. భారతదేశంలోనే నెట్‌గా ఈ సినిమా 386.9 కోట్ల రూపాయలు వసూలు చేయడం విశేషం.


More Telugu News