క్లచ్ చెస్ లెజెండ్స్: విశ్వనాథన్ ఆనంద్‌పై విజయం తర్వాత కాస్పరోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఆనంద్‌పై 13-11 తేడాతో కాస్పరోవ్ విజయం
  • పునరావృతమైన 1995 వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫలితం
  • గతం తాలూకు ఒత్తిడి ఆనంద్‌పై ఉండి ఉండొచ్చు అన్న కాస్పరోవ్ 
చెస్ క్రీడలో చరిత్ర మరోసారి పునరావృతమైంది. దిగ్గజ ఆటగాళ్ల మధ్య జరిగిన క్లచ్ చెస్ లెజెండ్స్ మ్యాచ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌పై గ్యారీ కాస్పరోవ్ విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 13-11 పాయింట్ల తేడాతో కాస్పరోవ్ గెలుపొందాడు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జరిగిన ఫలితమే మళ్లీ పునరావృతం కావడం విశేషం.

ఈ మ్యాచ్‌లో కాస్పరోవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కీలకమైన పదో గేమ్‌లో ఆనంద్‌ను ఓడించి, మరో రెండు బ్లిట్జ్ గేమ్‌లు మిగిలి ఉండగానే మ్యాచ్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. చివరి రోజు ఆట ప్రారంభమయ్యేసరికి ఐదు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న కాస్పరోవ్, అదే జోరును కొనసాగించాడు. రెండో గేమ్‌లో ఆనంద్ చేసిన ఒక వ్యూహాత్మక పొరపాటు ఓటమికి దారితీసింది. అయితే, ఇప్పటికే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ, చివరి రెండు బ్లిట్జ్ గేమ్‌లలో ఆనంద్ అద్భుతంగా ఆడి విజయం సాధించడం గమనార్హం.

ఈ విజయంతో 1995 నాటి జ్ఞాపకాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 1995 అక్టోబర్ 10న న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగిన క్లాసికల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా కాస్పరోవ్ చేతిలోనే ఆనంద్ ఓటమి పాలయ్యాడు. అప్పుడు 10.5-7.5 పాయింట్ల తేడాతో కాస్పరోవ్ గెలిచాడు.

విజయం అనంతరం కాస్పరోవ్ మాట్లాడుతూ, "ఈ మ్యాచ్‌లో నేను గెలుస్తానని అస్సలు ఊహించలేదు. చాలా మందిలాగే నా అంచనాలను కూడా మించి ఆడాను. చరిత్రలో నాతో ఆడిన మ్యాచ్‌లలో ఆనంద్‌కు మంచి రికార్డు లేదు. బహుశా గతం తాలూకు స్మృతులు ఆట సమయంలో అతడిని వెంటాడి ఉండవచ్చు. ఇది అతడిపై మానసిక ఒత్తిడి పెంచి ఉండొచ్చు" అని పేర్కొన్నాడు. తన ఆట మునుపటిలా లేకపోయినా, ఇక్కడికి వచ్చి ప్రజలను అలరించడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని అన్నాడు.

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 1,44,000 డాలర్ల ప్రైజ్ మనీ ఉండగా, విజేతగా నిలిచిన కాస్పరోవ్‌కు 78,000 డాలర్లు (సుమారు రూ. 65 లక్షలు), రన్నరప్‌గా నిలిచిన ఆనంద్‌కు 66,000 డాలర్లు (సుమారు రూ. 55 లక్షలు) లభించాయి.



More Telugu News