గిల్‌ను మహాసముద్రంలోకి తోసేశాం... కెప్టెన్సీపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందన్న కోచ్ గంభీర్
  • కెప్టెన్ గా మునిగిపోతావో, గొప్ప ఈతగాడిగా తేలతావో నీ ఇష్టమని గిల్‌తో అన్నట్లు వెల్లడి
  • ఇంగ్లండ్ సిరీస్‌లో గిల్ ఒత్తిడిని ఎదుర్కొన్న తీరు ఎంతో నచ్చిందని ప్రశంస
  • బయటి విమర్శలను ఏమాత్రం పట్టించుకోవద్దని గిల్‌కు సూచన
భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్‌గా గిల్‌కు బాధ్యతలు అప్పగించే సమయంలో తాము అతని ముందు ఉంచిన సవాలును, దానిని గిల్ అధిగమించిన తీరును గంభీర్ వివరించాడు. 25 ఏళ్లకే టెస్ట్ కెప్టెన్సీ వంటి కీలక బాధ్యతను అప్పగించడం అంటే, అతడిని నేరుగా లోతైన సముద్రంలోకి తోసేయడం లాంటిదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఒక స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడుతూ గంభీర్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. "మేము నిన్ను లోతైన మహాసముద్రంలోకి విసిరేశాం. నీ ముందు రెండే మార్గాలు ఉన్నాయి: ఒకటి గొప్ప స్విమ్మర్‌గా మారి ఒడ్డుకు చేరడం, లేదా మునిగిపోవడం. ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం" అని గిల్‌తో తాను చెప్పినట్లు గంభీర్ గుర్తుచేసుకున్నాడు.

ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్‌లో గిల్ అద్భుతంగా రాణించాడని, ఆ సిరీస్‌లో 750కి పైగా పరుగులు చేసినప్పటికీ, అంతకంటే ముఖ్యంగా అతను ఒత్తిడిని ఎదుర్కొన్న విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని గంభీర్ తెలిపాడు. "ఓవల్ టెస్ట్ ముగిశాక నేను గిల్‌తో ఒక్కటే చెప్పాను. నువ్వు అత్యంత కఠినమైన పరీక్షలో పాసయ్యావు. ఇకపై నీ ప్రయాణం మరింత సులువు అవుతుంది" అని అన్నట్లు వెల్లడించాడు.

బయట నుంచి వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని, నిలకడగా పరుగులు చేయడంపైనే దృష్టి పెట్టాలని గిల్‌కు సూచించినట్లు గంభీర్ పేర్కొన్నాడు. 


More Telugu News