Anand Mahindra: బీస్ట్ మళ్లీ వస్తోంది... ఎప్పటికీ ఇదే నా ఫేవరెట్: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra Announces Bolero Comeback in 2025
  • తన ఫేవరెట్ కారు ఎప్పటికీ బొలెరోనేనని చెప్పిన ఆనంద్ మహీంద్రా
  • తన బొలెరోను 'బ్లాక్ బీస్ట్' అని పిలుచుకుంటానని వెల్లడి
  • 2000 సంవత్సరం నుంచి నిరంతరాయంగా ఉత్పత్తిలో ఉన్న వాహనం
  • ఈ కారును ఆపేయాలని చాలాసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదని వ్యాఖ్య
  • 2025లో సరికొత్త అవతార్‌లో బొలెరో రాబోతోందని ప్రకటన
  • 'ది బీస్ట్ ఈజ్ బ్యాక్' అంటూ ఉద్వేగభరిత పోస్ట్
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన మనసులోని మాటను బయటపెట్టారు. తన కంపెనీ ఎన్నో అత్యాధునిక కార్లను తయారు చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ తాను వ్యక్తిగతంగా నడపాలనుకునే కారు మాత్రం 'బొలెరో'నే అని ఆయన స్పష్టం చేశారు. మహీంద్రా సంస్థ తయారు చేసిన అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ వాహనం ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e)ని ప్రస్తుతం వాడుతున్నప్పటికీ, తన తొలి ప్రాధాన్యత మాత్రం ఎప్పటికీ బొలెరోకేనని ఆయన అన్నారు. ఈ కారుతో తనకున్న అనుబంధాన్ని, దాని ప్రత్యేకతలను వివరిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

ఆనంద్ మహీంద్రా తన పాత రోజులను గుర్తుచేసుకుంటూ, మహీంద్రా నుంచి వచ్చిన తొలి హార్డ్-టాప్ ఎస్‌యూవీ 'ఆర్మాడా' వచ్చినప్పటి నుంచి తాను వేరే బ్రాండ్ కారు నడపలేదని తెలిపారు. అంతకుముందు హిందూస్థాన్ మోటార్స్ కంటెస్సా వాడేవాడినని పేర్కొన్నారు. అయితే, స్కార్పియో లాంచ్ కాకముందే తాను తన బొలెరోను విస్తృతంగా నడిపానని, దానికి 'బ్లాక్ బీస్ట్' అని ముద్దుగా పేరు కూడా పెట్టుకున్నానని చెప్పారు. దాని దృఢత్వం, ఎలాంటి ఆర్భాటం లేని సరళమైన నిర్మాణం దానిని ఒక నిజమైన 'ఓల్డ్-స్కూల్ రోడ్ వారియర్'గా నిలబెట్టాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు ఆ 'బీస్ట్' మళ్లీ తిరిగి వస్తోందని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. కానీ 2025కు తగ్గట్టుగా సరికొత్త అవతార్‌లో బొలెరో పునరుద్ధరించబడుతోందని ఆయన తెలిపారు. 2000 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన బొలెరో, వ్యాగన్ఆర్ తర్వాత నిరంతరాయంగా ఉత్పత్తిలో ఉన్న అత్యంత పాత భారతీయ కార్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచిందన్నారు. మారుతి ఆల్టో కంటే కేవలం ఒక నెల మాత్రమే పెద్దదని గుర్తుచేశారు.

గత కొన్నేళ్లుగా కంపెనీలోని ఆటోమోటివ్ బృందాలు ఎన్నోసార్లు ఈ మోడల్‌ను నిలిపివేయాలని చర్చలు జరిపాయని, కానీ ప్రతిసారీ అది వీడ్కోలు పలకడానికి నిరాకరించిందని ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ, కొత్త టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్ అవుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని ఆయన ప్రశంసించారు. 'ది బీస్ట్ ఈజ్ బ్యాక్' అంటూ ఆయన చేసిన ప్రకటన, బొలెరో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 25 ఏళ్లుగా భారత రోడ్లపై తనదైన ముద్ర వేసిన ఈ వాహనం, కొత్త రూపంలో ఎలా రాబోతోందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Anand Mahindra
Mahindra Bolero
Bolero 2025
Mahindra XUV 9e
SUV
Indian cars
Automotive industry
Black Beast
Armada
Old School Road Warrior

More Telugu News