Amir Khan Muttaqi: ఢిల్లీలో ఆఫ్ఘన్ మంత్రి ప్రెస్ మీట్.. మహిళా జర్నలిస్టులకు ప్రవేశం నిరాకరణ.. వివాదంపై కేంద్రం కీలక ప్రకటన

Amir Khan Muttaqi Delhi Press Meet Denies Entry to Women Journalists
  • ఢిల్లీలో ఆఫ్ఘన్ మంత్రి మీడియా సమావేశంపై తీవ్ర వివాదం
  • మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై వెల్లువెత్తిన విమర్శలు
  • ఈ వ్యవహారంలో తమ ప్రమేయం లేదన్న భారత విదేశాంగ శాఖ
  • ముంబైలోని ఆఫ్ఘన్ కాన్సులేట్ నుంచి కొందరికే అందిన ఆహ్వానాలు
  • కేంద్రం తీరుపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆగ్రహం
ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తఖీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో భారత ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈ ప్రెస్ మీట్ నిర్వహణలో తమకు ఎలాంటి పాత్ర లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో శుక్రవారం ఈ మీడియా సమావేశం జరిగింది. అయితే, దీనికి మహిళా జర్నలిస్టులెవరినీ అనుమతించలేదు. కొంతమంది మహిళా రిపోర్టర్లను లోపలికి రాకుండా అడ్డుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో పలువురు జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తామంతా నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్ పాటించినా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ వివరణనిచ్చింది. ముంబైలోని ఆఫ్ఘన్ కాన్సుల్ జనరల్ కార్యాలయం నుంచి ఢిల్లీలోని కొందరు జర్నలిస్టులను ఎంపిక చేసి ఆహ్వానాలు పంపారని తెలిపింది. ఆఫ్ఘన్ రాయబార కార్యాలయ ప్రాంగణం భారత ప్రభుత్వ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.

ప్రియాంక గాంధీ ఆగ్రహం
మరోవైపు ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. మహిళా జర్నలిస్టులను అవమానించడంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఈ విషయంపై స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికి గర్వకారణమైన మహిళలకు ఇలాంటి అవమానం జరగడం దారుణమని ఆమె అన్నారు.

పర్యటనలో భాగంగా ఆఫ్ఘన్ మంత్రి ముత్తఖీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. వాణిజ్యం, అభివృద్ధి సహకారం వంటి అంశాలపై చర్చించారు. అయితే, ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశానికి మాత్రం చాలా మంది జర్నలిస్టులకు సమాచారం ఇవ్వలేదు. కేవలం 15-16 మందిని మాత్రమే ముంబై కాన్సులేట్‌కు చెందిన తాలిబన్ అధికారి ఇక్రముద్దీన్ కామిల్ స్వయంగా ఫోన్ చేసి పిలిచినట్లు తెలిసింది. ఇలా కొందరినే ఎంపిక చేసి పిలవడం, మహిళలను పూర్తిగా దూరం పెట్టడం పత్రికా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై తాలిబన్ల కఠిన ఆంక్షల నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Amir Khan Muttaqi
Afghanistan
Delhi
Press Meet
Women Journalists
MEA
Jaishankar
Priyanka Gandhi
Taliban
India

More Telugu News