పెంపుడు శునకంతో రష్మిక సెల్ఫీ వీడియో.. వేలికి మెరుస్తున్న ఎంగేజ్ మెంట్ రింగ్

  • మొన్న విజయ్, నేడు రష్మిక.. వేలికి ఉంగరాల ఫొటోల వైరల్
  • అక్టోబర్‌ 3న వీరి నిశ్చితార్థం జరిగిందని వార్తలు
  • తాజా ఫొటోలతో నిజమేనని కన్ఫర్మ్ అయిందంటూ సంబరపడుతున్న అభిమానులు
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా ఇన్ స్టాలో పంచుకున్న ఓ సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో రష్మిక పెంపుడు శునకాన్ని ముద్దు చేస్తుండగా.. ఆమె చేతికి డైమండ్ రింగ్ మెరుస్తూ కనిపించడంతో అభిమానులు సంబరపడుతున్నారు. హీరో విజయ్ దేవరకొండతో రష్మికకు ఈ నెల 3న నిశ్చితార్థం జరిగిందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని విజయ్ కానీ, రష్మిక కానీ కన్ఫర్మ్ చేయకపోవడంతో అభిమానుల్లో కొంత సందేహం నెలకొంది.

ఇటీవల పుట్టపర్తికి వెళ్లిన విజయ్ దేవరకొండ చేతి వేలికి ఉంగరంతో కనిపించడం, తాజాగా రష్మిక చేతి వేలికీ ఉంగరం కనిపించడంతో ఎంగేజ్ మెంట్ వార్తలు నిజమేనని భావిస్తున్నారు. తమ అభిమాన హీరోహీరోయిన్లు నిజంగానే ఒక్కటవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ ఒక ఫేమస్ డెస్టినేషన్ లో పెళ్ళి చేసుకుంటారని తెలుస్తోంది.

‘గీత గోవిందం’ సినిమాతో మంచి ఆన్‌స్క్రీన్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్, రష్మిక జంట.. ‘డియర్‌ కామ్రేడ్‌’ తో ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని చాలాకాలంగా రూమర్లు ఉన్నాయి. అయితే ఈ విషయంపై హీరో హీరోయిన్లు ఇద్దరూ ఎక్కడా స్పందించలేదు. ఇద్దరూ కలసి తిరుగుతున్న ఫోటోలు పలుమార్లు వైరల్ గా మారాయి. కాగా, ప్రస్తుతం రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ రూపొందిస్తున్న సినిమాలోనూ విజయ్, రష్మిక జంటగా నటిస్తున్నట్లు సమాచారం.


More Telugu News