Swathi Varma: ఐర్లాండ్‌లో భారత యువతిపై జాత్యహంకార దాడి.. వీడియో వైరల్

Indian woman Swathi Varma racially abused in Dublin Ireland
  • ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌లో భారత యువతిపై జాతి వివక్ష దాడి
  • 'మీ దేశానికి తిరిగి వెళ్లిపో' అంటూ దూషణలకు దిగిన గుర్తుతెలియని మహిళ
  • సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్వాతి వర్మ
  • స్వాతి ధైర్యాన్ని, సంయమనాన్ని ప్రశంసిస్తున్న నెటిజన్లు
ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌లో నివసిస్తున్న స్వాతి వర్మ అనే భారత యువతికి ఒక భయానక అనుభవం ఎదురైంది. జిమ్ నుంచి ఇంటికి నడిచి వెళ్తున్న ఆమెపై గుర్తు తెలియని మహిళ జాత్యహంకార దూషణలకు పాల్పడింది. అక్టోబర్ 8న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది.

స్వాతి వర్మ తన ఇంటికి సమీపంలో ఉండగా, డబ్లిన్ సిటీ యూనివర్సిటీ (డీసీయూ) బ్యాడ్జ్ ధరించిన ఒక మహిళ ఆమెను సమీపించింది. దారి అడుగుతుందేమోనని స్వాతి భావించగా ఆమె అనూహ్యంగా "నువ్వు ఐర్లాండ్‌కు ఎందుకొచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ దేశానికి తిరిగి వెళ్ళిపో" అంటూ దురుసుగా ప్రశ్నించడం ప్రారంభించింది. ఈ అనూహ్య పరిణామంతో స్వాతి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఆ మహిళ అక్కడితో ఆగకుండా "నీకు వర్క్ వీసా ఉందా?" అని ప్రశ్నించింది. దానికి స్వాతి బదులిస్తూ "అవును, నేను ఇక్కడ ఉచితంగా ఉండటం లేదు. పన్నులు చెల్లిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు నా వంతు సహకారం అందిస్తున్నాను" అని స్పష్టం చేశారు. అయితే, ఆ మహిళ "నువ్వు చేసిన అతిపెద్ద తప్పు అదే.. వెంటనే ఇండియాకు తిరిగి వెళ్లు" అని బదులిచ్చింది.

ఈ సంభాషణలో కొంత భాగాన్ని స్వాతి తన ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఆ వీడియోలో, "నువ్వు ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని యజమానులకు డబ్బులిస్తున్నావు. వాళ్లకు అధికారం ఇస్తున్నావు. కానీ, నేనే అధికారం, నేనే శక్తిని" అంటూ ఆ మహిళ వింతగా మాట్లాడటం వినిపిస్తోంది. ఈ క్రమంలో ఒక బాటసారి కల్పించుకోగా, అతడిపై కూడా ఆమె అదే విధంగా దూషణలకు దిగింది.

ఈ దాడితో తాను తీవ్రంగా భయపడ్డానని, షాక్‌కు గురయ్యానని స్వాతి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. తాను సురక్షితంగా ఉండాలన్నదే తన మొదటి ఆలోచన అని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, స్వాతికి భారీగా మద్దతు లభిస్తోంది. ఆమె ధైర్యాన్ని, సంయమనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Swathi Varma
Ireland
Dublin
racist attack
Indian woman
DCI
Dublin City University
work visa
social media
viral video

More Telugu News